Mlas Poaching Case ED : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడైన నందకుమార్ ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు చేస్తుంది. సిట్ దర్యాప్తు చేస్తుండగా... ఈడీ కూడా విచారణ చేపట్టింది. మొయినాబాద్‌ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈసీఐఆర్‌ ను నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, సెవెన్‌హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ ఆవాలాను ఈడీ విచారించింది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ను ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఒక రోజు విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 26న నందకుమార్ ను ఈడీ అధికారులు విచారించునున్నారు. చంచలగూడా జైల్లో నందకుమార్ స్టేట్మెంట్ నమోదు చేయనున్నారు.  


ఈడీ ఎంటర్ 


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఈ కేసులో మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించామని తెలిపింది. రూ.100 కోట్ల డీల్ గురించి చర్చించినందున మనీ లాండరింగ్‌కు ఆధారాలున్నాయని ఈడీ పిటిషన్ లో తెలిపింది. ఈ నెల 15న 48/2022 నంబరుతో ఈడీ ఈసీఐఆర్‌ నమోదు చేసింది. నందకుమార్‌ను విచారించి కీలక సమాచారం రాబట్టేందుకు అనుమతించాలని కోర్టును కోరింది. నందకుమార్‌ స్టేట్మెంట్ నమోదు చేసేందుకు నలుగురు ఈడీ అధికారులతో కూడిన బృందాన్ని అనుమతించేలా చంచల్‌గూడ జైలు అధికారులను ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌పై శనివారం నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నందకుమార్‌ను ఒక రోజు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. 26న చంచల్‌గూడ జైలులోనే నందకుమార్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.


నందకుమార్ పై అభిషేక్ ఫిర్యాదు 


ఇటీవలే ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నంద కుమార్ తనను 1.75 కోట్ల మేరకు మోసం చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అభిషేక్ రెండో వారంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అభిషేక్, రోహిత్ రెడ్డి సోదరుడి మధ్య రూ.7.75 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయి, డబ్బులు ఎందుకు పంపించుకున్నారు, రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధాలపై పూర్తి స్థాయిలో కూపీ లాగేందుకు అభిషేక్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే రోహిత్ రెడ్డిని కూడా ఎక్కువగా 7 హిల్స్ మాణిక్ చంద్ పాన్ మసాలాకు సంబంధించిన లావాదేవీలపైనే ప్రశ్నించినట్లు తెలుస్తోంద


 
రామచంద్ర భారతి అరెస్టు 


ఈ కేసులో మరోక కీలక నిందితుడు రామచంద్ర భారతిని బంజారాహిల్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రామచంద్ర భారతిని రిమాండ్‌కు తరలించారు. నకిలీ పాస్‌పోర్టు కేసులో ముందస్తు బెయిల్‌ కోసం రామచంద్రభారతి గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.