Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి  నియోజకవర్గం వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదమ్మ బండ తండాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. 


ఈదమ్మ తండాకు చెందిన ఐదుగురు.. మేకలు, పశువులు మేపడానికి అడవికి వెళ్ళారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో ఐదుగురు ఒక చెట్టు కిందకి వెళ్ళారు. అదే సమయంలో పిడుగు పడడంతో.. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు నేనావత్ నాన్కో(50), సంధ్యారాణి(25) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం, క్షతగాత్రులు రుప్ల, వైశాలి, కల్లలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  


నెల రోజుల క్రితం పిడుగుపాటుకు ముగ్గురు మృతి..! 


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ కు చెందిన రాథోడ్ మనోజ్ (35) అనే రైతు సోమవారం తన పొలంలో పంటకు పురుగుల మందు కొడుతుండగా భారీ వర్షం కురిసింది. మందు కొడుతూ దగ్గరలోని చెట్టు వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా  అతడిపై పిడుగు పడటంతో మనోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. 


చేనులో పనిచేస్తుండగా.. 


కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్ మండలం గోపాల్ పూర్ గ్రామంలో పొలంలో పనికోసం వెళ్లిన అజయ్ (17) అనే యువకుడు వర్షం కురుస్తుండటంతో ఓ చెట్టు కిందకు వెళ్లాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ యువకుడిపై పిడుగు పడటంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.  కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని సుంగాపూర్ గ్రామంలో మధ్యాహ్నం కురిసిన వర్షానికి పత్తి చేనులో పని చేసుకుంటున్న తండ్రి కొడుకులపై పిడుగు పడింది. సుంగాపూర్ గ్రామానికి చెందిన బొమ్మన లచ్చయ్య.. ఆయన కొడుకు శ్రీరామ్ తమ పంట చెనులో పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడింది. 


శ్రీరామ్ మృతి, తండ్రికి గాయాలు!


దీంతో కొడుకు శ్రీరామ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోగా.. తండ్రి లచ్చయ్యకి స్వల్ప గాయాలయ్యాయి. పక్క చేనులోని వ్యవసాయ కూలీలు వెంటనే తండ్రి లచ్చయ్యతో పాటు కొడుకు శ్రీరామ్ లను హుటాహుటిన సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కొడుకు శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిర్యాణి మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి శ్రీరామ్ మృతిచెందడాని డాక్టర్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.