AP Vs Telangana : ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఆదేశాల విషయంోల తెలంగాణకు స్వల్ప ఊరట లభించింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అప్పటివరకు తెలంగాణపై కఠినమైన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబరు 18కి వాయిదా వేసింది.
నెల రోజుల్లోగా ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్రం
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఏపీ ఇచ్చిన కరెంట్ కు సంబంధించి విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చివరికి కేంద్రం ఏపీకి, తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్ర విద్యుత్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం బకాయిపడ్డ రూ.3,441 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ ను, రూ.3,315 కోట్ల లేట్ పేమెంట్ సర్ చార్జీ చెల్లించాలని పేర్కొంది. ఆ బకాయిలను తెలంగాణ రాష్ట్రం 30రోజుల్లోగా చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు దగ్గర పడటంతో తెలంగాణ సర్కార్ హైకోర్టు నుంచి ఊరట పొందింది.
ఏపీనే తమకు ఇవ్వాలంటున్న తెలంగాణ !
ప్రస్తుతం కేంద్రం కట్టాలని ఆదేశించినవి కాకుండానే ఏపీ నుంచి తమకు రూ. 12, 490 కోట్లు రావాలని తెలంగాణ వాదిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు వడ్డీతో కలుపుకొంటే.. రూ.3,819 కోట్లు ఉన్నాయి. అలాగే పవర్ పర్చేజ్‌కు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.6,639 కోట్లు చెల్లించాలి. ఏపీ ట్రాన్స్‌కో నుంచి రూ.1,730 కోట్లు రావాలి. దీనితోపాటు ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణకు రూ.4,026 కోట్లు రావాలని చెబుతున్నారు. ఇక కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.1,614 కోట్లు ఇవ్వాలి. ఇవన్నీ కలుపుకుని.. ఏపీకి ఇవ్వాల్సిన వాటినీ తీసేస్తే.. రూ.12 వేల 490 కోట్ల కంటే ఎక్కువే ఇవ్వాలని తెలంగాణ వాదిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి కూడా లేఖ రాసింది. హైకోర్టు పిటిషన్‌లోనూ చెప్పింది.
రైల్వే జోన్‌పై అసలు కేంద్రం ప్రకటన ఇదిగో - అనుమానాలన్నీ తీరిపోయినట్లేనా ?
హైకోర్టు ఆదేశాలతో విద్యుత్ బకాయిలు ఇప్పుడల్లా ఏపీకి దక్కనట్లే !
కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే.. పవర్ ఎక్సైంజీలలో విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం విధించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కఠినమైన చర్యలు వద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో తెలంగాణ సర్కార్‌కు ఇబ్బంది లేనట్లే. అయితే ఈ బకాయిలు వస్తాయని అనుకుంటున్న ఏపీ సర్కార్‌కు మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది.
జాతీయ పార్టీపై ముందుకే కేసీఆర్ - దసరా రోజున పార్టీ పేరు ప్రకటన !?