Mulugu News: ఇద్దరు యువకులను మావోయిస్టు పార్టీలో చేరేలా ప్రేరేపించిన మాజీ నక్సలైటుతో సదరు యువకులను ములుగు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ సంగ్రాంసింగ్ జి. పాటిల్  తెలిపారు. ఇద్దరు యువకులు మావోయిస్టు దళంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారాన్ని విశ్వసనీయ  వర్గాల ద్వారా అందుకున్న డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ వెంటనే ఓఎస్డీ ములుగు గౌష్ ఆలం, స్థానిక ములుగు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. ఓంకార్ యాదవ్  నేతృత్వత్వంలో ఒక టీంను ఏర్పాటు చేశారు. మావోయిస్టు పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులతో పాటు ప్రేరేపించిన మాజీ నక్సలైట్ బోట్ల అశోక్ ను అరెస్ట్ చేసి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 



వివరాల్లోకి వెళ్తే.. మల్లంపల్లికి చెందిన బాలుగు గణేష్, జాకారం గ్రామానికి చెందిన పుల్యాల నవీన్, మాజీ నక్సలైట్ బోట్ల అశోక్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. బొట్ల అశోక్ అనే వ్యక్తి వ్యక్తిగత స్వార్ధంతో యువకులను తప్పుదోవ పట్టించాడని గతంలో అతని పై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. మావోయిస్టుల్లో కలిసేలా యువకులను ప్రోత్సహించింది బోట్ల అశోక్ అని విచారణలో తెలిందని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు.


ములుగు జిల్లా పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి.. 


స్వార్థ ప్రయోజనాల కోసం  ఇలాంటి వ్యక్తులు చెప్పే మాటలు నమ్మొద్దని వారి అసత్య ప్రచారాలకు బలి కావద్దని జల్లా ఎస్పీ యువతకు సూచించారు. మావోయిస్టు పార్టీ భావజాలాన్ని విశ్వసించవద్దని ఎవరైనా వ్యక్తులు మావోయిస్టు భావజాలానికి అనుకూలంగా ఏవైనా ప్రచారాలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్


తెలంగాణలో డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు జరుగు పి ఎల్ జి ఏ వారోత్సవాల సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేస్తున్న మిలీషియా సభ్యులు ఆరుగురుని అరెస్టు చేశారు ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు. వారి వద్ద కరపత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ జరిపిన పోలీసులు ఆ ఆరుగురిని కోర్టుకు తరలించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏఎస్పీ కార్యాలయంలో మిలీషియా సభ్యుల అరెస్టుకు సంబంధించిన వివరాలు ఏఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. వెంకటాపురం పోలీసులు, సీఆర్పిఎఫ్ సిబ్బంది ముత్తారం సీతాపురం క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆరుగురు అనుమానాస్పదంగా తరసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ ఇంచార్జ్ సుధాకర్ వద్ద 2018 నుండి పనిచేస్తున్నట్లు తెలిపారు.


వీళ్లు మావోయిస్టుల కొరియర్ లు- పోలీసులు


డిసెంబర్ తొలి వారంలో పి ఎల్ జి ఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని అగ్ర నాయకుల ఆదేశాల మేరకు వారోత్సవాల కరపత్రాలను ఆయా గ్రామాలలో రోడ్లపై వేయాలని సూచించగా.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై గతంలో పలు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పై కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. పట్టుబడిన ఆరుగురు మిలీషియా సభ్యుల వద్ద కరపత్రాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.