Madhya Pradesh Illegal Sand Mining: మధ్యప్రదేశ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా ఇసుక మైనింగ్ చేస్తున్న వారిని అడ్డుకోడానికి వెళ్లిన పోలీస్‌ని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేసింది. పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...షెహ్‌దోల్‌ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మహేంద్ర బర్గి ఇసుక మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఉన్నారు. మాఫియాని అడ్డుకోడానికి వెళ్లిన సమయంలో వాగ్వాదం జరిగింది. వెంటనే ముగ్గురినీ ట్రాక్టర్‌తో తొక్కేశారు దుండగులు. ఈ ఘటనలో మహేంద్ర బర్గి అక్కడికక్కడే చనిపోగా మిగతా ఇద్దరు కానిస్టేబుల్స్‌ ప్రాణాలతో బయట పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు అతని పక్కనే ఉన్న మరో వ్యక్తినీ అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ ఓనర్ పరారీలో ఉన్నాడు. 






ఈ నిందితుడికి సంబంధించిన సమాచారం అందించిన వాళ్లకి రూ.30 వేల నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్ ఓనర్ కొడుకు కూడా ఈ ఘటన జరిగినప్పుడే అక్కడే ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టడి చేస్తామని భరోసా ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలోనే ఈ ఇసుక మాఫియా విపరీతంగా పెరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. సోన్ నదీ తీరంలో ఉన్న ఇసుకని ఇష్టమొచ్చినట్టు తవ్వేసి అక్కడి నుంచి వేరే చోటకు తరలిస్తున్నారు. ఇప్పుడే కాదు. గతేడాది నవంబర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇసుక మైనింగ్‌ని అడ్డుకునేందుకు వెళ్లిన ఓ రెవెన్యూ అధికారిని ఇలాగే ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశారు. 


"మహేంద్ర బర్గితో పాటు ఆయన టీమ్‌ ఇసుక అక్రమ మైనింగ్‌ని అడ్డుకోవాలని అక్కడికి వెళ్లారు. అరెస్ట్ చేయాలని భావించారు. కానీ ఉన్నట్టుండి ఆ దుండగులు ట్రాక్టర్‌తో తొక్కేశారు. అక్కడికక్కడే ఆయన చనిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నాం. ట్రాక్టర్ ఓనర్ కొడుకుకీ ఈ హత్యలో హస్తం ఉంది. అతడినీ అరెస్ట్ చేశాం. మైనింగ్ చట్టం కింద కేసులు నమోదు చేశాం"


- పోలీస్ అధికారులు






Also Read: Viral News: ప్యాంట్‌లో పాములు పెట్టుకుని స్మగ్లింగ్, అవాక్కైన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది