CSK vs PBKS IPL 2024 Preview and Prediction: ఐపీఎల్(IPL) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS) చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై జట్టు కసిగా ఉంది. గత మ్యాచ్‌లో చెన్నై 162 పరుగులు చేయగా... పంజాబ్ సునాయసంగా ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలుపు తప్పనిసరి కావడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని చెన్నై, పంజాబ్ జట్లు పట్టుదలతో ఉన్నాయి. పంజాబ్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లాలని రుతురాజ్ సారధ్యంలోని చెన్నై జట్టు భావిస్తోంది.
లోపాలు అధిగమించి...
ఈ మ్యాచ్‌లో చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ కీలకమ్యాచ్‌లో తిరిగి విజయాల బాట పట్టాలని రుతురాజ్ సేన పట్టుదలగా ఉంది. కానీ సొంత మైదానం చెపాక్‌లో చెన్నైపై విజయం సాధించిన పంజాబ్ కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. చెన్నై 10 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐదు విజయాలతో 10 పాయింట్లను కలిగి ఉంది. 16 పాయింట్లు సాధించాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు మ్యాచ్‌ల్లో చెన్నై గెలవాలి. అందుకే ఈ మ్యాచ్ కీలకం కానుంది. గత మ్యాచ్‌లో పంజాబ్ స్పిన్నర్లు హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్‌లను ఎదుర్కోవడంలో చెన్నై తడబడింది. కేవలం ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులే చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబేపై చెన్నై బ్యాటింగ్ ఆధారపడి ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో ఇప్పటికే అయిదుసార్లు 50కుపైగా పరుగులు చేసి సత్తా చాటాడు. అనుభవజ్ఞుడైన బ్యాటర్ అజింక్య రహానే, రవీంద్ర జడేజా రాణించాల్సి ఉంది. దీపక్ చాహర్ ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మతీషా పతిరాణ, తుషార్ దేశ్‌పాండే..
పైనే చెన్నై బౌలింగ్ భారం ఉంది.
వరుస విజయాలు
మరోవైపు పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుస విజయాలు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది. అహ్మదాబాద్‌లో గుజరాత్‌పై, చెపాక్‌లో చెన్నైపై విజయాలు సాధించింది. టీ 20 చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్నిఛేదించి ఆత్మ విశ్వాసంతో ఉంది. వరుస విజయాలతో 8 పాయింట్లతో పంజాబ్ ఏడవ స్థానానికి చేరుకుంది. కోల్‌కత్తాపై సెంచరీ చేసిన జానీ బెయిర్‌స్టోతో పాటు రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా రాణిస్తే పంజాబ్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో కగిసో రబడ, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, శామ్‌కరణ్ పర్వాలేదనిపిస్తున్నారు. గత మ్యాచ్‌లో చెన్నైను కట్టడి చేసిన హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్‌లు మరోసారి రాణించవలసి ఉంటుంది.
జట్లు:
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), MS ధోని, అరవెల్లి అవనీష్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, మిచెల్ సాంట్నర్ , దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, తీక్షణ, సమీర్ రిజ్వీ.
పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌ.