ఏలూరులో కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తుపట్టలేనంతగా ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటిపై ఉన్న గదిలో వృద్ధురాలి మృతదేహం ఉండగా.. అదే ఇంట్లో కింది గదిలో ఉంటున్న తన కోడలికి విషయం తెలియకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొడుకే కన్నతల్లిని చంపి విషయం బయటకు రాకూడదనే భయంతో సుమారు మూడు నెలలుగా ఆమె మృతదేహాన్ని ఇంటి పై గదిలో ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు లోనితంగెళ్ళమూడి యాదవ్ నగర్ మహిషాసుర మర్దిని ఆలయ సమీపంలో శరణార్థి నాగలక్ష్మి (75) నివాసం ఉంటుంది. భర్త మల్లికార్జునరావు విజయవాడ ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన మృతి చెందారు. వచ్చే పింఛన్తో సొంత ఇంటిలోనే పై భాగంలో వృద్ధురాలు నివసిస్తుంది. ఆమె కుమారుడు దుర్గ ప్రసాద్, భార్య లలితాదేవి కింద పోర్షన్లో ఉంటున్నారు. వృద్ధురాలు ఇంటి తలుపులు మూసి ఉండటం, ఆమె కనిపించకపోవడం, ఎంతకీ దుర్వాసన తగ్గకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మంగళవారం పోలీసులు సిబ్బందితో అక్కడికి వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా వృద్ధురాలి మృతదేహం కనిపించింది. అక్కడ కుళ్ళిపోయిన స్థితిలో పురుగులు పట్టి వృద్ధురాలి మృతదేహం కనిపించింది. దీన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆమె మృతి చెంది మూడు నెలలై ఉంటుందని ప్రాధమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అనంతరం మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగలక్ష్మి కి ఆమె కుమారుడు ప్రసాద్కు కొంతకాలం నుంచి మాటలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడే ఏదైనా చేశాడా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి తోడు పోలీసులు వచ్చిన దగ్గరనుంచి అతను కనిపించలేదు. తర్వాత అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మూడు నెలల కిందట ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల వాళ్ళు అడగగా పిల్లి చనిపోయిందని తీయించి వేస్తామని అతడు చెప్పినట్లు స్థానికులు తెలిపారు.
మృతురాలి కోడలు లలిత మాత్రం తనకు ఏమీ తెలియదని తన అత్తగారు తమకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్లు భావిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. పిల్లి చనిపోయిందని అందుకే దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల వారిని నమ్మించారు. ఇప్పుడు తీరా వృద్ధురాలు మృతదేహం బయటపడగానే ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కొడుకు దుర్గాప్రసాద్ తన తల్లిని చంపి భయంతో మృతదేహాన్ని పై ఫ్లోర్ దాచి ఉంటాడని అనుమానిస్తున్నారు.
ఘటన స్థలానికి చేరుకున్న ఏలూరు డిఎస్పి శ్రీనివాసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతురాలు నాగమణి మృతదేహాన్ని మూడు నెలలగా దాచిపెట్టడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆమె సహజంగా మరణిస్తే ఎందుకు ఇన్ని రోజులు మృతదేహాన్ని దాచిపెట్టారు? ఒకవేళ ఇది హత్య? అయితే దీనికి గల కారణాలు ఏమిటి? లేకపోతే ఆత్మహత్య? అయితే మృతదేహం కుళ్ళిపోయే వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.