చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సీజేఐ బెంచ్ మంగళవారానికి (అక్టోబరు 3) వాయిదా వేసింది. అక్టోబరు 3న పిటిషన్ కి సంబంధించి అన్ని విషయాలు వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. తొలుత ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం వద్దకు వెళ్లగా.. జస్టిస్ భట్టి ఈ పిటిషన్ పై వాదనలు వినడానికి ఒప్పుకోని సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేయాలని సీజేఐ వద్ద మెన్షన్ చేశారు. 


నేడు (సెప్టెంబరు 27) ఉదయం త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, రెండో న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఉన్నారు. జస్టిస్ భట్ ఈ పిటిషన్ విచారణకు నిరాకరించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ... ‘‘మై బ్రదర్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టికి ఈ పిటిషన్ విచారణపై కొన్ని అంతరాలు ఉన్నాయి. మిస్టర్ హరీష్ సాల్వే మేం ఈ పిటిషన్‌ని మరో బెంచ్ కి బదిలీ (పాస్ ఓవర్) చేస్తాము’’ అని అన్నారు.


చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను సిద్ధార్థ లూథ్రా సీజేఐ ముందు మెన్షన్‌ చేశారు. తక్షణమే లిస్టింగ్‌ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్‌ కోరుకుంటున్నారా? అని సీజేఐ ప్రశ్నించారు. తాము బెయిల్‌ కోరుకోవడం లేదని లూథ్రా తెలిపారు. త్వరగా లిస్ట్‌ చేయాలన్నది తమ మొదటి అభ్యర్థన అని.. మధ్యంతర ఉపశమనం కలిగించాలని రెండో అభ్యర్థన అని లూథ్రా అన్నారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశం అని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టేందుకు అవకాశం లేని కేసు ఇదని చెప్పారు. ట్రయల్‌ కోర్టు జడ్జిని సంయమనం పాటించాలని చెప్పలేమని అన్నారు. జెడ్‌ కేటగిరీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్‌ చేస్తారా? అని అన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని సిద్ధార్థ్ లూథ్రా అన్నారు.