Mother Gave Birth To The Child After Father Death In Same Hospital In Kurnool: ఏపీలో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన గంట తర్వాత అతని భార్య అదే ఆస్పత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఓ వైపు బిడ్డ జననం.. మరోవైపు తండ్రి మరణం అక్కడి వారిని కలిచివేసింది. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లాలో (Kurnool District) జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా (Gadawal District) రాజోలి మండలం తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివకు ఏపీలోని కర్నూలు జిల్లా బనగానపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో ఏడాది క్రితం వివాహమైంది. శివ రాజోలిలోని ఓ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. మంగళవారం తుమ్మలపల్లె నుంచి రాజోలికి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి అతనికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానికులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని భార్యకు తెలిపినా ప్రాణాపాయం లేదని చెప్పారు.


భర్త చనిపోయిన గంటకు..


అయితే, మంగళవారం రాత్రే లక్ష్మికి కూడా పురిటినొప్పులు రావడంతో ఆమెను బంధువులు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో శివ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు, అతను మరణించిన గంటలోపే లక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓ వైపు భర్త మరణం.. మరోవైపు కొడుకు జన్మించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో శివ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


రూ.లక్షకు బిడ్డను అమ్మేసింది


నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లే తన 3 నెలల బిడ్డను రూ.లక్షకు అమ్మేసింది. చివరకు డబ్బుల విషయంలో తలెత్తిన వివాదంతో ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరమ్మ 3 నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు శిశువు కావాలని 3 వారాల క్రితం నెల్లూరు జిల్లా కావలికి చెందిన నాగమణి ఆమెను సంప్రదించింది. ఇందుకు సరేనన్న వెంకటేశ్వరమ్మ తన బిడ్డను నాగమణికి అప్పగించింది. ఇందులో భాగంగా ఆమె తల్లికి రూ.80 వేలు చెల్లించింది. మిగతా రూ.20 వేలు ఇవ్వాలని అడగడంతో నాగమణి సమాధానం చెప్పలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వరమ్మ బాపట్ల పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కావలి నుంచి మగబిడ్డను రక్షించి శిశువును ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో బాలసదనానికి తరలించారు. ఇరువురిపైనా కేసు నమోదు చేసినట్లు బాపట్ల సీఐ మహమ్మద్ జానీ తెలిపారు. శిశు విక్రయాలు చట్టరీత్యా నేరమని అన్నారు. ఇలాంటి వాటిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.


Also Read: Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన