GHMC Commissioner Key Announcement On Firecrakers Shops: దీపావళి పండుగ వస్తోందంటే చాలు బాణసంచా సందడి మొదలవుతుంది. ఈ క్రమంలో భాగ్యనగరంలో బాణసంచా విక్రయాలకు సంబంధించి జీహెచ్ఎంసీ (GHMC) కీలక ప్రకటన చేసింది. క్రాకర్స్ విక్రయించే దుకాణదారులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి (Ilambarthy) తెలిపారు. హోల్ సేల్ దుకాణాలకు రూ.66 వేలు, రిటైల్ దుకాణాలకు రూ.11 వేలు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు. దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వారంతా నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్, జీహెచ్ఎంసీ వెబ్ సైట్ www.ghmc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇవీ రూల్స్
- బాణసంచా దుకాణాలు ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చెయ్యొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. అలాగే, స్టాల్స్‌కు ఏర్పాటు చేసే విద్యుత్‌కు సంబంధించి నాణ్యమైన పరికరాలు ఉపయోగించాలని అన్నారు.
- దుకాణాల వద్ద ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అందుకు దుకాణాల యజమానులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కాలనీలు, బస్తీలకు దూరంగా మైదానాలు, పెద్ద హాల్స్‌లో తగిన ఫైర్ సేఫ్టీతో షాప్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
- తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులు, న్యాయస్థానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించారు.
- కొన్ని టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని.. వాటిని అమ్మకూడదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారుల తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేస్తామని హెచ్చరించారు.