మేడ్చల్ జిల్లా: చిన్న చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం అయిపోయిందన్నట్లుగా భావించి సూసైడ్ చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని కొందరు యువత, కొత్త డ్రెస్ ఇవ్వలేదనో.. బైక్ కొనివ్వలేదనో ఏదో ఒక కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాల్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మందలించాడని ఇలాంటి చర్యలతో తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చుతున్నారు.


సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీ, రాజీవ్ గృహకల్ప లో అశోక్ అనే యువకుడు కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతడి వయసు 17 సంవత్సరాలు, కాగా చింతల్ లోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సర చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి గణేష్ నిమజ్జనానికి వెళ్లడంతో  రాత్రి ఇంటికి రాలేదు. దాంతో తండ్రి అశోక్ ను మందలించడంతో క్షణికావేశంలో ఇంటి నుంచి వెళ్లిపోయి ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విద్యార్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేసినా, ఏం చెప్పినా ఇది పిల్లల బాగు కోసమేనని.. వాళ్లు మిమ్మల్ని ఏదో అన్నారని ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని యువతకు పోలీసులు సూచించారు. ఇలా ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు కడుపుకోత తప్ప, మిగిలేది ఏం ఉండదని.. చనిపోయి మీరు సాధించేది ఏం లేదని గుర్తుంచుకోవాలన్నారు.


రాత్రి ఇంటికిరాలేదని మందలించిన తండ్రి..


హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 17న నిర్వహించనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను అధికారులు ఏర్పాటు చేసిన కృత్రిమ చెరువులలో నిమజ్జనం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని, కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదని సైతం తమ తీర్పులో హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. సెప్టెంబర్ నెల వచ్చి గణేష్ నిమజ్జనాల సమయంలో పిటిషన్లు వేయడం ఏంటని పిటిషనర్ ను జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ కె అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. వినాయక నిమజ్జనాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీపై నిషేధం విధించాలని కోర్టును కోరగా, వీటిపై నిషేధం లేకున్నా అధికారులు పీవోపీ విగ్రహాలకు సంబంధించి కేసులు నమోదు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.