Medak Crime News: ఊరంతా వినాయక చవితి సంబురాలు చేసుకుంటున్నారు. ఆ ఇల్లు కూడా ఆనందంగా గడపాలి. కానీ తల్లి మందలించిందనే కోపంతో ఓ యువ బస్సు కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..?
మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన 24 ఏళ్ల సాయితేజ తండ్రి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే తండ్రి ఆర్టీసీ బస్సు కండక్టర్. అతడు చనిపోవడంతో ఆ ఉద్యోగాన్ని కుమారుడు సాయి తేజకు ఇచ్చారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉద్యోగం చేసుకున్న సాయితేజ... మద్యానికి బానిసై విధులకు డుమ్మా కొట్టడం ప్రారంభించాడు. అయితే విషయం తెలుసుకున్న తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నర్సాపూర్ ఆర్టీసీ డిపో సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పింటించుకున్నాడు. విషయం గుర్తించిన డిపో సెక్యూరిటీ సిబ్బంది మంటలు ఆర్పారు. వెంటనే సాయితేజని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన సాయితేజ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Medak News: పోలీసు ఉద్యోగం వద్దన్న అత్తింటి వాళ్లు - ఆత్మహత్య చేసుకున్న కోడలు!
పోలీసు ఉద్యోగం వద్దన్నారని యువతి ఆత్మహత్య
చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనుకుంది. లక్ష్యానికి తగ్గట్లుగానే కష్ట పడి చదివింది. రన్నింగ్, హై జంప్ వంటివి కూడా బాగా ప్రాక్టీసు చేసి ఇటీవలే ఉద్యోగం సాధించింది. ఇంకొన్ని రోజుల్లో పోలీస్ డ్రెస్సులో తనని తాను చూసుకొని మురిసిపోవాలనుకుంది. కానీ ఆమె ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. పోలీసు ఉద్యోగం వద్దంటూ భర్త, అత్త, మామలు వేధించడం మొదలు పెట్టారు. చిన్నప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్న పోలీసు ఉద్యోగాన్ని అత్తింటి వాళ్లు వద్దనడంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గం వీణవండ మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మార్త రాజయ్య దంపతులకు కుమార్తె కల్యాణి ఉంది. అయితే ఈమెకు నాలుగు నెలల క్రితం మెదక్ జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలకు చెందిన కారు హరీశ్ తో వివాహం జరిగింది. అయితే కల్యాణికి చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనే కల ఉంది. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడింది. ఎంబీఏ చదివిన ఆమె పోలీసు ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షించింది. ఇటీవలే ఫలితాలు రావడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి కల్యాణి అర్హత సాధించింది. అనుకున్న లక్ష్యం చేరుకోబోతున్నందుకు కల్యాణి చాలా సంతోషించింది. కానీ అత్తింటి వాళ్లు మాత్రం అలాగే ఉన్నారు. కోడలు పోలీసు అవ్వబోతుందంటే .. మనకెందుకు ఇవన్నీ అంటూ కామెంట్లు చేశారు. భర్త హరీష్ తో పాటు అత్త రమణ, మరిది శ్రీహరి మానసికంగా వేధించారు.
కలత చెందిన కల్యాణి శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన అత్తా, భర్తలు వెంటనే విషయాన్ని కల్యాణి తల్లిదండ్రులకు తెలిపారు. హుటాహుటిన మెదక్ కు చేరుకున్న కల్యాణి తండ్రి.. అత్తింటి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూతురు పోలీసు అయితే చూసి మురిసిపోవాలనుకున్న తల్లిదండ్రులకు.. అచేతనంగా పడి ఉన్న కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.