Mancherial News : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి లక్షట్టిపేటలోని హాస్టల్ లో కమాటిగా పనిచేస్తున్న క్రమంలో 2015 లో లక్షట్టిపేట కు చెందిన ప్రవీణ్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులకు విషయం చెప్పి పెళ్లిచేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ వారి కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారని ప్రవీణ్ చెబుతున్నారు. తనతో పెళ్లికి ఒప్పుకోకుండా మరో అబ్బాయితో పెళ్లి నిర్ణయం చేసి శనివారం పెళ్లి చెయ్యడానికి సిద్ధం అయ్యారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రవీణ్ అమ్మాయి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సుమారు ఐదు లక్షల రూపాయల నగదు, బంగారం కూడా ఇచ్చానని చివరికి అన్ని తీసుకోని తనను మోసం చేసి వేరే అబ్బాయితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడంతో తనకు న్యాయం చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రవీణ్. ఈ విషయమై పోలీసులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.


వివాహితకు వేధింపులు


నగ్న వీడియోతో మహిళను వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ దిశా పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ మేరకు నిందితులిద్దరిపై చర్యలు తీసుకున్నారు. బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థే దిశా పోలీస్ సిస్టమ్. ఎన్నిసార్లు హెచ్చరించిన కొందరి ప్రవర్తనలో మార్పు రావడంలేదు. చివరికి జైలుకు వెళ్లి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.


కేసు నమోదు, అరెస్టు 


రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన వ్యక్తిగత అవసరాల కోసం హన్స కుమార్ అనే వ్యక్తిని డబ్బు అప్పుగా అడిగింది. మహిళ అత్యవసర స్థితిని ఆసరాగా చేసుకున్న హన్స కుమార్.. ఆ మహిళను నమ్మించి న్యూడ్ గా వీడియో చిత్రీకరించాడు. తర్వాత ఆ వీడియోను చూపించి వేధిస్తున్నాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను నగ్నంగా ఉన్న ఆ వీడియోను మరో వ్యక్తికి పంపించి ఇద్దరూ కలిసి తనను వేధిస్తున్నారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మహిళా బాధితురాలి ఫిర్యాదుపై దిశా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల వద్ద ఉన్న నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దిశ చట్టం ప్రకారం వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 


వీడియో కాల్ రికార్డింగ్ 


రాజమండ్రికి చెందిన ఓ మహిళకు వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్ల భర్తతో విడిపోయింది. పిల్లలతో వేరుగా ఉంటోంది. కుటుంబ పోషణ కోసం ఓ దుకాణం నడిపిస్తోంది. అయితే వ్యాపార అవసరాల కోసం రాజమండ్రికి చెందిన హన్స కుమార్ జైన్ అనే వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకుంటూ ఉండేది. ఇటీవల ఆ మహిళ మరోసారి హన్స కుమార్ జైన్ ను అప్పు అడిగింది. అయితే ఈ సారి అతను ఎక్కువ వడ్డీ అవుతుందని చెప్పాడు. ఆ వడ్డీకి  ఒప్పుకుంటేనే అప్పు తీసుకోవాలని బదులిచ్చాడు. వడ్డీ భరించలేక పోతే తనతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలని, గెస్ట్ హౌస్‌కు రావాలని ఆ మహిళపై ఒత్తిడి పెంచాడు. డబ్బు అవసరం ఎక్కువగా ఉండటం, కుటుంబ పోషణకు డబ్బు అవసరం కావడంతో ఆమెకు మరో దారి లేక అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. మహిళ అసహాయతను ఆసరాగా తీసుకున్న హన్స కుమార్ జైన్.. స్క్రీన్ రికార్డింగ్ సాయంతో ఫోన్ లో కొన్ని అసభ్య వీడియోలు రికార్డు చేశాడు. మహిళ నగ్న వీడియోను విజయవాడలోని కానూరులో ఉంటున్న అతని బంధువు చందు చూశాడు. ఆ వీడియోను తన ఫోన్, ల్యాప్ టాప్ లోకి కాపీ చేసుకున్నాడు. ఆ వీడియోను అశ్లీల సైట్లలోకి అప్ లోడ్ చేసి, వాటి లింక్ ను బంధువులకు పంపిస్తానని చందు అనే వ్యక్తి ఆ మహిళను బెదిరించడం ప్రారంభించాడు. వీడియో స్క్రీన్ షాట్ ను తీసి బాధితురాలితో పాటు తన వ్యాపార భాగస్వామికి కూడా పంపించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె భరించలేకపోయింది. మచిలీ పట్నంలోని పోలీసులకు ఈ మేరకు వారిపై ఫిర్యాదు చేసింది. మచిలీ పట్నం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానిని మహిళా పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన వడ్డీ వ్యాపారి హన్స కుమార్ జైన్, విజయవాడ కానూరుకు చెందిన చందును పోలీసులు అరెస్టు చేశారు.


Also Read : న్యూడ్ వీడియోలతో వివాహితకు వేధింపులు - రంగంలోకి దిగిన దిశా పోలీసులు, ఇద్దరు వ్యక్తులు అరెస్టు


Also Read : Bhadradri Kottagudem News : లవర్ ను గర్భవతి చేసిన యువకుడు, అబార్షన్ వికటించి యువతి మృతి