Bhadradri Kottagudem News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భద్రాచలంలోని సురక్ష ఆసుపత్రిలో ఓ యువతికి అబార్షన్ చేసేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే వైద్యం వికటించడంతో యువతి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిని మూసివేయాలని డిమాండ్ చేశారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబసభ్యులు సురక్ష ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువతి మృతికి కారణమైన యువకుడు,వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత యువతి బంధువులు డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని సురక్ష ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ వికటించి విద్యార్థిని మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ములకలపల్లి మండలం వీకే. రామవరం గ్రామానికి చెందిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఓ యువకుడు ట్రాప్ చేసి గర్భవతి చేశాడు. గర్భం దాల్చిన విద్యార్థినిని అబార్షన్ చేయించేందుకు ఎవరికీ తెలియకుండా ఆ యువకుడు శుక్రవారం భద్రాచలంలోని సురక్ష ఆసుపత్రిలో జాయిన్ చేయించాడు.
ప్రియుడు పరారీ
ఐదు నెలల గర్భవతి కావడంతో అబార్షన్ చేయడం వల్ల అమ్మాయి పరిస్థితి విషమంగా మారి మృతి చెందింది. విషయం తెలిసి ఆసుపత్రికి తీసుకొచ్చిన యువకుడు పరారైయ్యాడు. అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులు డయల్ 100 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. యువకుడి పేరు భుక్యానంద అని తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రియుడు భూక్యా నంద కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఏటా 73 మిలియన్ల అబార్షన్లు
భారత్ లో ముందస్తు జననాలు, శిశు మరణాలకు అబార్షన్లు కారణమవుతున్నాయని ఓ సర్వేలో తేలింది. కుటుంబ నియంత్రణకు అబార్షన్‌ను ఉపయోగించడంతో 62% ముందస్తు జననాలు, శిశు మరణాలు పెరుగుతున్నాయని సర్వే నివేదిక తెలుపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 73 మిలియన్ల అబార్షన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. భారతదేశంలో అబార్షన్ రేటు 15-49 సంవత్సరాల వయసు గల వెయ్యి మంది మహిళలకు 49గా ఉందని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. బలవంతపు అబార్షన్లు ముందస్తు జనన ప్రమాదాన్ని 25–27 శాతం పెంచుతోందని సర్వేలో తేలింది. వివిధ కారణాలతో మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంభిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తెలిపింది. కుటుంబ నియంత్రణకు పట్టణాల్లో మహిళలు సురక్షిత చర్యలు తీసుకుంటునప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మాత్రం కుటుంబ నియంత్రణ పేరుతో అబార్షన్ లకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో దారుణం- నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి