Mancherial Crime News: హత్య చేసి పారిపోయిన నిందితులను మంచిర్యాల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సాంకేతికత సాయంతో నిందితులను అరెస్టు చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో హత్య జరిగింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు.


అసలేం జరిగిందంటే..


నిందితుడు గూడ సతీష్.. మృతుడు జింక లచ్చన్న అలియాస్ గంగన్న ఇంటి పక్కనే ఉండేవాడు. మృతుడు లచ్చన్న కూతురు లక్ష్మీ, నిందితుడు కొడుకు రాజుకి పరిచయం ఉండేది. అతని స్నేహితుడు షోయబ్ కూడా లక్ష్మీకి పరిచయం ఏర్పడింది. షోయబ్ తో సాన్నిహిత్యం పెరగటంతో లక్ష్మీ అతడికి బంగారం, డబ్బులు ఇచ్చింది. కానీ కొన్ని రోజులు అయ్యాక వారి మధ్య కలహాలు మొదలయ్యాయి. దాంతో తాను ఇచ్చిన బంగారం, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినా.. షోయబ్ ఇవ్వలేదు. అయితే రాజు వల్లే తన కూతురికి షోయబ్ పరిచయం అయ్యాడని, అందువల్ల రాజే డబ్బులు ఇవ్వాలని లక్ష్మీ తల్లిదండ్రులు రాజు ఇంటికి వచ్చి గొడవ పడ్డారు. మీ అమ్మాయి అతడికి డబ్బులు ఇస్తే మాకేం సంబంధం అంటూ రాజు, రాజు తల్లిదండ్రులు చెప్పినా.. లక్ష్మీ తల్లిదండ్రులు జింక లచ్చన్న, రాజేశ్వరి వినిపించుకోలేదు. తరచూ రాజు ఇంటికి వచ్చి గొడవ పడేవారు. బూతులు తిడుతూ ఇష్టారీతిగా వ్యవహరించే వారు.


దీంతో రాజు తల్లిదండ్రులు.. అతడిని విదేశాలకు పంపితే అయినా.. వారు పెట్టే ఇబ్బందులు తప్పించుకోవచ్చని భావించి రాజును ఇరాక్ పంపించారు. రాజు వెళ్లిపోయినా కూడా లక్ష్మీ తల్లిదండ్రులు వేధించడం ఆపలేదు. వారి తీరుతో విసిగిపోయిన రాజు తల్లిదండ్రులు సతీష్, భూలక్ష్మీ... వారిని చంపితే కానీ మనశ్శాంతి ఉండదని భావించారు. మరో ముగ్గురి సాయంతో వారిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 11వ తేదీన లచ్చన్న, రాజేశ్వరి మరోసారి రాజు ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. ముందుగా అనుకున్న ప్రకారం ఇంట్లో సిద్ధంగా ఉన్న మంచం పట్టితో లక్ష్మీ తల్లిదండ్రులు జింక లచ్చన్న, రాజేశ్వరీని కొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోతూ.. చంపడానికి ఉపయోగించిన మంచం పట్టీని ఇతర వస్తువులను చెట్ల పొదల్లో దాచి పెట్టి పారిపోయారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు..


ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. దగ్గర్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ తీసుకుని దాని ద్వారా నిందితులను కనిపెట్టారు. వారు ఏ సమయంలో ఎటు వైపు వెళ్లారో ఈ దృశ్యాలను చూసి గుర్తించారు. నిందితులు జన్నారం నుంచి వేరే ప్రాంతానికి పారిపోవడానికి  జన్నారం బస్టాండ్ కి వెళ్తున్నారనే సీఐ కరీముల్లా ఖాన్ కి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి  నిందితులు సతీష్, భూలక్ష్మీ, లక్ష్మీ, మల్లవ్వ, లచ్చన్నను అరెస్టు చేశారు.