Man Suspicious Death In Muchumarri Minor Incident: నంద్యాల (Nandyal) జిల్లా ముచ్చుమర్రిలో (Muchumarri) 8 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నందికొట్కూరుకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలిక మృతదేహాన్ని మాయం చేసేందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబ సభ్యులను పోలీసులు 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరైన హుస్సేన్ ఈ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌లో మృతి చెందాడు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడా.? లేక మరేదైనా కారణమా.? అనేది తెలియాల్సి ఉంది. మృతదేహంపై గాయాలున్నాయని.. లాకప్ డెత్ అయ్యాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు తీవ్రంగా హింసించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


ఇంకా వీడని మిస్టరీ


నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు ఇంకా వెతుకులాట కొనసాగిస్తున్నారు. గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్లు ఆడుకుందామని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దీంతో బాలిక మృతి చెందగా మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ నెల 7న బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ముగ్గురు మైనర్లను నిందితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం తొలుత ఎత్తిపోతల కాలువలో ఎన్టీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. నిందితులు పూటకో మాట మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. 


ఈ క్రమంలో నిందితులతో సహా వారి తల్లిదండ్రులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను కాపాడేందుకు వారి తల్లిదండ్రులు మృతదేహాన్ని మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో శ్మశానంలో పాతిపెట్టామని నిందితులు చెప్పగా.. అక్కడా పోలీసులు గాలింపు చేపట్టారు. అయినా బాలిక మృతదేహం దొరకలేదు. చివరకు కృష్ణా నదిలో మృతదేహాన్ని పడేశామని చెప్పగా పోలీసులు వెతుకుతున్నారు.


Also Read: Nara Lokesh: సౌదీ అరేబియాలో మరో తెలుగు వ్యక్తి దీన స్థితి - స్పందించిన మంత్రి లోకేశ్, స్వస్థలానికి తీసుకొస్తామని భరోసా