చాలా మంది కుర్రకారు ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. విపరీతంగా ఫోన్ ను యూజ్ చేస్తున్నారు. అలా ఫోన్లు వాడుతూనే సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. పొద్దున నిద్ర లేచిన సమయం నుంచి ఫోన్ పట్టుకునే ఉంటున్నారు. స్క్రీన్ లో అలా అలా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా కళ్లు ఫోన్ తెరపైనే ఉంచి బదులిస్తారు. తినే సమయంలోనూ ఒక చేతిలో ఫోన్ మాత్రం ఉండాల్సిందే. అమ్మా నాన్న, అక్కా చెల్లి తమ్ముడు అన్నా ఎవరు పలకరించినా ఏమని ప్రశ్నించినా.. ఏది అడిగినా.. వారు మాత్రం తమ కళ్లను ఫోన్ కు అప్పగించే బదులు ఇస్తారు. రాత్రి ఫోన్ పట్టుకునే నిద్రకు ఉపక్రమిస్తారు. ఏ అర్ధరాత్రో నిద్ర పోతారు. నిద్ర పోతున్న సమయంలోనే ఫోన్ దిండు పక్కనే ఉండాలి. లేకపోతే నిద్ర పట్టదు. అంతలా అడిక్ట్ అయిపోతోంది కుర్ర కారు.


ఫాలోవర్స్ కోసం ఎంతకైనా..


సోషల్ మీడియా పెరిగిన ఈ కాలంలో చాలా మంది వాటిలోనే మునిగి తేలుతున్నారు. తమ టాలెంట్ ను ఉపయోగించి వీడియోలు చేస్తూ అందులో పోస్టు చేస్తారు. ఫాలోవర్స్ ను ఆకట్టుకునేందుకు చాలా రకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఇందులో కొన్ని విపరీతమైన ధోరణితో ఉంటాయి. కొందరు లైకులు, షేర్లు, కామెంట్లు పెరగడం కోసం ఎలాంటి వీడియోలైనా తీసేందుకు వెనకాడరు. దిల్లీ ఉత్తమ్ నగర్ లో నివాసముండే 28 ఏళ్ల వ్యక్తి.. ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఒక దారుణమైన పని చేశాడు. ఆ వ్యక్తి చేసిన ఆ పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 


అంతలా ఏం చేశాడు,,?


న్యూ దిల్లీలో ఉత్తమ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు 28 ఏళ్ల వ్యక్తి. తనకు సోషల్ మీడియా అంటే విపరీతమైన పిచ్చి. ఎప్పుడూ అందులోనే మునిగి తేలుతాడు. తన పేజీలో వివిధ రకాలు వీడియోలు పోస్టు చేస్తాడు. అలా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాదించుకునే పనిలో పడ్డాడు. ఎంతకీ ఫాలోవర్స్ పెరగకపోవడంతో ఒక దారుణమైన పని చేశాడు. ఆ 28 ఏళ్ల వ్యక్తికి గతంలోనే పెళ్లి జరిగింది. అతను దిల్లీలో ఉంటుంటే.. అతని భార్య మాత్రం ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఉంటుంది. ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక రోజు స్నానం చేస్తుండగా వీడియో కాల్ మాట్లాడుకుందామంటూ భార్యను బలవంతం చేశాడు. అతని ఒత్తిడి తట్టుకోలేని ఆ మహిళ చివరికి తను చెప్పిందే చేయాల్సి వచ్చింది. స్నానం చేస్తూ భర్తతో వీడియో కాల్ మాట్లాడింది. 


అలా వీడియో కాల్ మాట్లాడుతుండగా దానిని రికార్డు చేశాడు భర్త. ఫేస్ బుక్ లో తన పేజీకి ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఆ వీడియోను వాడుకోవాలని అనుకున్నాడు. తన పేజీలో తన భార్య స్నానం చేస్తున్నప్పటి వీడియోను పోస్టు చేశాడు. దాంతో పాటు ఆమె వ్యక్తిగత ఫోటోలను కూడా పెట్టడం ప్రారంభించాడు. 


అలా దొరికిపోయాడు.. 


ఒక రోజు ఫేస్ బుక్ చూస్తుండగా.. తన వ్యక్తిగత ఫోటోలను గమనించిన భార్య.. భర్తను నిలదీసింది. ఆ ఫోటోలను, వీడియోను తీసేయమని అడిగింది. దానికి అతడు ఒప్పుకోక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫేస్ బుక్ కంపెనీని ఆశ్రయించి నిందితుడి ఫేస్ బుక్ పేజీని, ఖాతాను తొలగించారు.