Man Killed His Wife In Sarurnagar: కొందరు చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడుతున్నారు. ఓ వ్యక్తి తన భార్య చుడీదార్ వేసుకుందని ఆమెను కత్తితో పొడిచి చంపేసిన దారుణ ఘటన హైదరాబాద్ సరూర్ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా (Prakasam District) కొంజేడుకు చెందిన గుంజి వెంకటేశ్, సోనీ దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చారు. వీరు నగరంలోని కొత్తపేట సరస్వతీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. వెంకటేశ్ భవన నిర్మాణ పనుల్లో మేస్త్రీగా పని చేస్తున్నాడు. సోనీ చుట్టుపక్కల ఇళ్లల్లో పని చేస్తోంది. కాగా, భార్య సోనీ ప్రవర్తనను వెంకటేశ్ తరచూ అనుమానించేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఇళ్లల్లో పనులకు వెళ్లే సమయంలో చుడీదార్ వేసుకోవడంతో భర్త ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం ఓ ఇంటికి అలానే వెళ్లగా.. ఇంటికి తీసుకొచ్చిన వెంకటేశ్.. సోనీతో గొడవపడ్డారు. ఆమె బట్టలను చింపేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వెంకటేశ్.. కూరగాయలు కోసే కత్తితో భార్యను పొడిచి హత్య చేశాడు. ఈ పెనుగులాటలో వెంకటేశ్ చేతికి కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
ఇద్దరి మధ్య గొడవ జరిగే క్రమంలో భార్య తనపై దాడి చేసిందని.. ఆవేశంతో పొడుచుకుని చనిపోయిందని వెంకటేశ్ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. భార్య వల్ల తనకు కూడా గాయాలయ్యాయని బుకాయించాడు. అయితే, మృతురాలి వీపు భాగంలోనూ కత్తి పోట్లు ఉండడంతో.. భర్తే ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రాలు చేస్తున్నాడని..
మంత్రాలు చేస్తున్నాడని ఓ వ్యక్తిని కొందరు చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరులో ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిపై గతంలో మంత్రాలు చేస్తున్నాడని దాడి చేశారు. దీంతో కొద్దిరోజులుగా సాయిలు కామారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో తన సామగ్రి తీసుకువెళ్లేందుకు రాగా.. మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో కొందరు అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితునికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో పందెం..
అటు, మద్యం మత్తులో ముగ్గురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు ఊరి చివర చెరువు సమీపంలో పార్టీకి ప్లాన్ చేసుకున్నారు. ఫుల్లుగా మద్యం సేవించి.. పెద్దమ్మ దేవాలయం నుంచి పెద్ద చెరువు కట్ట వరకూ ఎవరు ముందుగా ఈత కొడుతూ చేరుకుంటారో తేల్చుకుందామని పందెం వేసుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురూ చెరువులో దిగి ఈత కొట్టగా.. ఇద్దరు అలసిపోయి వెనక్కు వచ్చేయగా.. మరో యువకుడు మధ్యలో ఇరుక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ట్యూబ్ సాయంతో యువకున్ని రక్షించారు. మద్యం మత్తులో ప్రాణాల మీదకు తెచ్చే పందేలు ఏంటంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ లో పెద్దపులి సంచారంతో భయంభయం, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి!