Man Molested Woman: రోజూ ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా చూపించడం లేదు. ఆడవాళ్లు అయితే చాలు వారిపై లైంగిక దాడి చేస్తున్నారు. ఇంటా బయటా ఎక్కడా ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా.. ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా.. భయపడాల్సిన దుస్థితి తలెత్తింది. ఏ కామాంధుడు ఏ రూపంలో దాడి చేస్తాడో తెలియని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఎటు నుంచి వచ్చి లైంగికంగా వేధిస్తారో కనీసం ఊహించడం కూడా కష్టంగా మారింది.
అదునుచూసి కాటేస్తున్న కామ నాగులు..
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అఘాయిత్యాల్లో ఎక్కువగా తెలిసిన వారే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సమీప బంధువులు, మామయ్యలు, బాబాయిలు, మరిది, బావ, వరుస అయ్యే వారు, దూరపు చుట్టాలు, ముసలీ ముతకలు, ఆఖరికి సోదరులు అయ్యే వాళ్లు కూడా అయిన వారిపైనే తమ కామాన్ని తీర్చుకుంటున్నారు. మన వాళ్లే కదా అని ఇంట్లోకి రానివ్వడం.. చుట్టాలే కదా అని నీళ్లు, ఛాయ్ ఇవ్వడమే వారి పాలిట శాపంగా మారుతోంది. ఒంటరిగా ఉన్నప్పుడు అదను చూసి మీద పడుతున్నారు. మహిళలపై మృగాళ్లుగా వ్యవహరిస్తున్నారు. అమాయకులైన మహిళలపై అరాచకం చేస్తున్నారు.
లైంగికదాడి చేసిన సమీప బంధువు..
ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితపై ఓ కామాంధుడు తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆమెను తీవ్రంగా కొట్టి తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వేములపల్లి మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ కాలనీకి చెందిన ఓ వివాహిత ఈ నెల 13న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలోనే సమీప బంధువు గుండె బోయి సైదులు.. కూర కావాలని అడుగుతూ ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని చూసి అదే అదనుగా భావించాడు. కామంతో ఆ వివాహిత చేయి పట్టుకోబోయాడు. సమీప బంధువే చేయి పట్టుకుని అలా చేయడంతో ఆమె అతడి చర్యలకు ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన గుండె బోయిన సైదులు ఆమె కడుపులో బలంగా తన్నాడు. వివాహిత కింద పడగానే ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
పోలీసుల అదుపులో నిందితుడు!
బాధితురాలు కడుపు నొప్పితో బాధ పడుతూ కేకలు వేయగా.. పక్కింట్లోని మట్టమ్మ బాధితురాలి వద్దకు వెళ్లింది. రక్త స్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చూసి ఆమె భర్తకు సమాచారం ఇచ్చింది. అనంతరం బాధితురాలు అయిన వివాహితను ఆటోలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో బాధిత మహిల ఆస్పత్రిలో నాలుగు రోజుల నుంచి చికిత్స పొందతూనే ఉంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా స్థిమిత పడలేదు. సాధారణ స్థితికి చేరుకోలేదు. శుక్రవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.