ఉత్తరప్రదేశ్‌లోని కేంద్ర మంత్రి నివాసంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. లక్నో శివారులోని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కౌశల్‌ కిషోర్‌కు చెందిన ఓ ఇంట్లో వినయ్‌ శ్రీవాత్సవ అనే 30 ఏళ్ల వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. అయితే అతడు గన్‌ తూటా తగిలి మరణించాడు. షూటింగ్‌కు ఉపయోగించిన గన్‌ మినిస్టర్‌ కుమారుడు వికాస్‌ కిషోర్‌కు చెందినదిగా గుర్తించారు. అయితే మరణించిన వినయ్‌ వికాస్‌కు స్నేహితుడని, ఈ హత్యలో ఏదో కుట్ర ఉందని చనిపోయిన వ్యక్తి సోదరుడు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన లక్నో శివారు గ్రామమైన బెగారియాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.


విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంత్రి కుమారుడు వికాస్‌ పేరుతో రిజిస్టర్‌ అయిన గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తి మంత్రి కుమారుడికి స్నేహితుడిగా గుర్తించినట్లు తెలిపారు. ఘటన జరిగిన ఇంటిని ప్రస్తుతం మంత్రి ఉపయోగించడం లేదని, ఆ సమయంలో మంత్రి గానీ, ఆయన కుమారుడు గానీ అక్కడ లేరని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆరుగురు వ్యక్తులను విచారిస్తున్నట్లు చెప్పారు. 


కౌశల్‌ కిషోర్‌ కేంద్ర హౌసింగ్‌, అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. తన కుమారుడు వికాస్‌ గురువారం మధ్యాహ్నం దిల్లీకి వెళ్లాడని, అందుకు సంబంధించిన బోర్డింగ్‌ పాస్‌లు, ఫ్లైట్‌లో తీసుకున్న ఫొటోలు కూడా ప్రూఫ్స్‌ ఉన్నాయని మంత్రి తెలిపారు. శ్రీవాత్సవ సోదరుడు మాత్రం తన సోదరుడి మరణంలో కుట్ర ఉందని, వికాస్‌ ఎక్కడికి వెళ్లినా, దిల్లీకి వెళ్లినా కూడా తన తుపాకీ వెంట తీసుకెళ్తాడని ఇప్పుడు ఎందుకు ఇంట్లో వదిలేసి వెళ్లాడని ప్రశ్నించారు. ఎందుకు తన సోదరుడిని చంపారో తెలియాలని, ఇది ప్లాన్‌ చేసి చేశారని ఆరోపించారు. మంత్రి మాత్రం గన్‌కు నేషనల్‌ లైసెన్స్‌ లేకపోవడం వల్లే తన కొడుకు దానిని తీసుకుని వెళ్లలేదని చెప్తున్నారు. కేవలం ఉత్తరప్రదేశ్‌ లైసెన్స్‌ మాత్రమే ఉందని చెప్పారు. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించామని తెలిపారు. కేవలం ఇంట్లో ఉన్న వాళ్లు మాత్రమే ఏం జరిగిందో చెప్పగలరని అన్నారు.


ఏదేమైనా జరిగిన విషయం చాలా విచారకరమని.. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని మంత్రి తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. ఘటనపై విచారణ జరుగుతోందని, దోషులుగా తేలిన వారికి శిక్ష పడుతుందని అన్నారు. తాము వినయ్‌ శ్రీవాత్సవ కుటుంబానికి అండగా ఉంటామని, అలాగే చట్టానికి సహకరిస్తామని తెలిపారు. వికాస్‌ ఆ సమయంలో ఇంట్లో లేడని, ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లని పోలీసులు విచారిస్తున్నారని ఆయన వెల్లడించారు. వినయ్‌, వికాస్‌ మంచి స్నేహితులని, అతడు మా ఇంటి వ్యక్తి లాంటి వాడు, విషయం తెలిసి నా కుమారుడు కన్నీళ్లు పెట్టుకున్నాడని మంత్రి మీడియాతో అన్నారు.