ఆహారం విషయంలో చెలరేగిన గొడవలు దాడులు, ఆత్మహత్యలు, హత్యలకు కూడా దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక నాన్ వెజ్ విషయంలో అయితే ఇవి ఇంకొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. వివాహ వేడుకల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమకు నచ్చిన ముక్కలు వడ్డించలేదనో లేదా కొంచమే వేశారనో వివిధ కారణాలతో పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డిలో చోటుచేసుకుంది. దావత్ జరుగుతున్న సమయంలో మటన్ ముక్కలు వేయలేదనే కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపాడు. 


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా అంకుశాపూర్‌కు చెందిన 15 మంది కూలీలు సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ శివారులోని శ్రీ సాయి బాలాజీ నర్సరీలో మామిడి మొక్కలకు అంటు కట్టేందుకు వచ్చారు. ఈ నెల 15న సాయంత్రం పని ముగించుకుని వారు ఉంటున్న రేకుల షెడ్డు వద్ద దావత్‌ చేసుకున్నారు. భోజనం చేసే సమయంలో దయనేని శివ, గోస్కుల పాపన్న (37) అనే ఇద్దరు వ్యక్తుల మధ్య మటన్ ముక్కలు వేయలేదనే కారణంగా గొడవ చెలరేగింది. ఇది కాస్తా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో శివ ఇనుప పైపుతో పాపన్న తలపై గట్టిగా కొట్టాడు. దీంతో పాపన్నకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. పాపన్న మృతి చెందాడు.  


ఎగ్ దోశకు డబ్బులివ్వలేదని ఆత్మహత్య.. 
ఆహారం విషయంలో మనస్తాపానికి గురై బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదనే కారణంలో సాయి కిరణ్ (21) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన సాయి కిరణ్..  ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎగ్ దోశ తినాలని ఉందని కుటుంబ సభ్యులను అడగగా.. వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన సాయి కిరణ్ గ్రామానికి సమీపంలోని గుర్రప్పకుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 


Also Read: Nellore Force Suicide : ఆత్మహత్యకు ప్రేరేపించి ప్రాణం పోయే వరకూ వీడియో తీసిన భర్త ! ఈ నెల్లూరు సైకో భర్త అచ్చంగా రాక్షసుడే...


Also Read: Chittoor: ఎగ్ దోశకు డబ్బు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి