శ్రీకాకుళం జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఓ మహిళ ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆమె చావుకు భర్త కారణం అన్న అనుమానంతో పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈరోజు అతడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇతడి ఆత్మహత్యపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత చిన్న పోలీస్ స్టేషన్ లో అతడెలా చనిపోతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా అతడు ఆత్మహత్య చేసుకుంటుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. 


భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే..


జిల్లాలోని ఎల్.ఎన్ పేట మండలం కొమ్మవలసకు చెందిన మహేష్.. వృత్తి రీత్యా వాహన డ్రైవర్. అయితే ఇటీవలే అతను బూర్జపేట మండలం సుంకరిపేటకు చెందిన శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. శ్రీదేవికి ఇది రెండో పెళ్లి. ఆమె బూర్జ మండలంలో వీఆర్ఏగా పని చేస్తోంది. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి అతడు అత్తవారింటి దగ్గరే ఉంటున్నాడు. కొన్ని రోజులపాటు బాగానే సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. చిన్న చిన్న మనస్పర్థల కారణంగా భార్య శ్రీదేవి నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురు చావుకు అల్లుడే కారణం అని.. శ్రీదేవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆదివారం రోజు మహేష్ ని విచారణ పేరిట అదుపులోకి తీసుకున్నారు. 


అరెస్ట్ చేసి మూడ్రోజులవుతున్నా..


ఈ క్రమంలోనే మంగళవారం రోజు మహేష్ పోలీస్ స్టేషన్ లో మృతి చెందాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మహేష్ ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మూడు రోజులు గడుస్తున్నా.. కోర్టులో హాజరు పరచకుండా 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో ఎలా ఉంచుతారని ప్రశ్నిస్తున్నారు. కనీసం భార్య దహన సంస్కారాలకు కూడా ఎందుకు వదల లేదని అడిగారు. మహేష్ మృతిపై తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రంతా బూర్జ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కస్టోడియల్ లో ఉన్న మహేష్ మృతి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.