Father Abused His Daughter In Macharla: పల్నాడు జిల్లాలో (Palnadu District) దారుణం జరిగింది. కంటికి రెప్పలా బిడ్డలను కాపాడాల్సిన కన్న తండ్రే తన కుమార్తెపై మృగాడిలా ప్రవర్తించాడు. భార్య, కుమార్తెకు మత్తు మందిచ్చి మరో కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్లలో కూరగాయల వ్యాపారం చేసుకునే వ్యక్తికి వెల్దుర్తి మండలానికి చెందిన మహిళతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. రెండేళ్ల కిందట తన భర్త పెద్ద కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన తల్లి తీవ్ర వేదనతో మనస్తాపానికి గురై పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రెండు నెలల కిందట సదరు వ్యక్తి పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టించాడు. తాను మారానని.. ఇకపై ఎలాంటి తప్పూ చేయనని చెప్పి భార్యను తిరిగి మాచర్లకు తీసుకెళ్లాడు. 


ఈ క్రమంలోనే గత పది రోజులుగా భార్య, చిన్న కుమార్తెకు కూల్ డ్రింక్‌లో మత్తు మందిచ్చి అనంతరం వారు మత్తులోకి జారుకున్న అనంతరం పెద్ద కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఉదయం పూట చిన్నారి ఏడుస్తుండడంతో గమనించిన తల్లి వైద్యులకు చూపించింది. బాలికపై లైంగిక దాడి జరిగిందని వారు చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. తన భర్త చేసిన దారుణాన్ని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరో ఘటన


అటు, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోనూ అమానుషం జరిగింది. ఓ మానసిక వికలాంగురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా బాలికపై అఘాయిత్యం చేస్తూ వీడియోలు తీశారు. అవి కాస్త వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులంతా మైనర్లుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.


Also Read: Tadipatri News:తాడిప‌త్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డికి సీఐ క్షమాపణలు- రాజకీయ దుమారం రేపుతున్న ఘటన