Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరూ ఊహించని రీతిలో ఘోరం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కన్న కూతుర్నే కడతేర్చాడు. కొత్తగా పెళ్లి అయి కాపురానికి వెళ్లనన్న నవవధువును తండ్రి హత్య చేశాడు. నవ వధువుతోపాటు భార్యను కూడా రొకలిబండతో కొట్టి చంపేశాడు. నిందితుడ్ని పోలీసులు కృష్ణయ్య అని గుర్తించారు. ఈ నెల 8న కృష్ణయ్య కుమార్తె 22 ఏళ్ల సరస్వతికి ఓ యువకుడితో పెళ్లి జరిపించారు. మళ్లీ ఈ నెల 25న కుమార్తెను తల్లి, తండ్రి కలమ్మ, కృష్ణయ్య కలిసి అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకొని వచ్చారు.
అయితే, అప్పటి నుంచి మళ్లీ అత్తారింటికి వెళ్లబోనని నవ వధువు సరస్వతి తల్లిదండ్రులకు చెప్పింది. అయితే, కాపురానికి వెళ్లాల్సిందేనని తండ్రి కృష్ణయ్య తన కుమార్తె సరస్వతిని మందలించాడు. అంతేకాక, తల్లి కలమ్మ కుమార్తె సరస్వతికి మద్దతుగా నిలిచింది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణయ్య తన భార్య కలమ్మను రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం కృష్ణయ్య కుమార్తె కూడా చంపాడు. ఆ తర్వాత విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికులు హుటాహుటిన నిందితుడితో పాటు కలమ్మ, సరస్వతిని మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నవ వధువు సరస్వతి, కలమ్మ మృతి చెందారు. కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.