మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల యువతిని నలుగురు వ్యక్తులు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. వీరిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అత్యాచారం అనంతరం బాధిత యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ సామూహిక అత్యాచార ఘటన ఫిబ్రవరి 18న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.


మహబూబాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 17న 23 ఏళ్ల యువతి అయిన బాధితురాలు ఏదో పనిపై ఓ ఆటో డ్రైవర్ (25) ఇంటికి వెళ్లింది. అదే సమయంలో మరో ముగ్గురు యువకులు కూడా అక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు నిందితుల్లో ఒకరు ఓ ఎంపీటీసీ సభ్యురాలి భర్త (30), మామునూరు 4వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ (28), మరో పూల వ్యాపారి (25) ఉన్నారని పోలీసులు తెలిపారు.


‘‘ఈ నలుగురు వ్యక్తులు కలిసి బాధితురాలిని సామూహికంగా అత్యాచారం చేశారు. ఫిబ్రవరి 18న అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె తీవ్ర గాయాలతో ఇంటికి వచ్చింది. పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగినట్లుగా భావించిన ఆమె వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్థానికులు గుర్తించి ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.’’ 


‘‘ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి మంగళవారం రాత్రి చనిపోయింది. అంతకుముందు ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది. నలుగురు వ్యక్తులు తనను పాడు చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొంది.’’ అని తొర్రూర్ పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. యువతి దేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించారు. విచారణ జరిపి నలుగురు నిందితులను గుర్తించామని తెలిపారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టినట్లుగా వెల్లడించారు. ఈ బాధిత యువతి తల్లి ఆమె చిన్నప్పుడే మరణించిందని, ఈమె తండ్రి ట్రక్కు డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. ఇంటర్ వరకూ చదివినట్లుగా పోలీసులు తెలిపారు.


(లైంగిక నేరాల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలు, కుటుంబ సభ్యుల గుర్తింపును గోప్యంగా ఉంచడం జరిగింది)


Also Read: Rape on Corpse: కన్న కూతుర్ని చంపేసి శవంపై అత్యాచారం! తండ్రి పాశవిక చర్య