Mahabub Nagar Accident: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. మంగళవారం ఉదయం స్కూటీపై కళాశాలకు బయలు దేరిన ఇద్దరు విద్యార్థుల వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే చనిపోగా మరో విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల అరవింద్.. జిల్లా కేంద్రంలోనే నివాసం ఉంటూ సమీపంలో ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ బ్రాంచ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతను ప్రతిరోజూ తన స్కూటీపై కళాశాలకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు సలీంతో కలిసి మంగళవారం ఉదయం కళాశాలకు బయలు దేరాడు. అయితే పాలమూరు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకోగానే.. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీని వెనక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అరవింద్ అక్కడికక్కడే మరణించగా.. సలీం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతుడు అరవింద్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సలీంను కూడా చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రిలో చేర్చారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాఫిక్ ఎస్ఐనే ఢీకొట్టిన యువకులు - మద్యం మత్తులోనే
ఫుల్లుగా మద్యం సేవించారు. ఆపై ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ కనిపించారు. దీంతో ఎక్కడ తమను పట్టుకుంటారోనన్న భయంతో పోలీసులను ఢీకొట్టి మరీ పారిపోయారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ మెక్ డోనాల్డ్స్ సమీపంలో ఎస్ఐ గౌనిగాని నరేష్ తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి 2 గంటలకు వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో ఫుల్లుగా తాగి ఇద్దరు వ్యక్తులు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుపై వస్తూ కనిపించారు. అయితే వారి మీద అనుమానం రావడంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు పోలీసులకు పట్టుబడతామనే భయంతో బైక్ వేగం పెంచారు. ఎదురుగా వస్తున్న ఎస్ఐ నరేష్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే అతడిని హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆ తర్వాత నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. మోకాలి కాలి నుంచి పాదం వరకు ఉన్న ప్రధాన ఎముక విరగడంతో సర్జరీ చేసిన వైద్యులు స్టీల్ రాడ్డును అమర్చారు.
అయితే ఎస్ఐని ఢీకొట్టి పరారైన నిందితులను పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికీ 190 కంటే ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్ సేవించినట్లు నిర్ధారణ అయింది నిందితులు రాంనగర్ రామాలయ ప్రాంతానికి చెందిన చంద్ర శేఖర్, న్యూ నల్లకుంటకు చెందిన యశ్వంత్ గా గుర్తించిన పోలీసులు శనివారం ఉదయం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.