మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి.. ఆమె జననాంగానికి కుట్లు వేశాడు. సింగ్రౌలీ జిల్లా మడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (64 ఏళ్లు) ఈ దారుణానికి ఒడిగట్టాడు. అదే గ్రామంలో నివసించే మరో వ్యక్తితో తన భార్య (55 ఏళ్లు) వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ పాశవిక చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి భార్యాభర్తల మధ్య గతంలో కూడా పలుమార్లు గొడవలు జరిగాయని చెప్పారు.
తాజాగా జరిగిన గొడవలో భార్యను తీవ్రంగా కొట్టాడని.. అనంతరం ఆమె జననాంగానికి పదునైన ఆయుధంతో కుట్లు వేశాడని పోలీసులు తెలిపారు. అత్యంత పదునైన అంచు ఉన్న మెటల్ కర్రతో కుట్లు వేసినట్లు వైద్య నివేదికలో నిర్ధారణ అయిందని చెప్పారు. భర్త చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఒక మహిళా పోలీసు అధికారిని సంప్రదించింది. ఆమె సాయంతో ఘాతుకానికి పాల్పడిన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి సింగ్రౌలీలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు కుట్లను తొలగించారని.. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఇంత చేసినా కూడా తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవద్దని బాధిత మహిళ వేడుకున్నట్లు చెబుతున్నారు.
Also Read: ‘అవి’ పెంచుకొనే సర్జరీ వికటించి.. కూర్చోలేక పాట్లు, నిలబడే కోట్లు గడిస్తున్న మోడల్