Macherla Fire Accident : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో మాసు శివయ్య అనే వ్యక్తి ఇంటిలో మంటలు చెలరేగి దగ్ధం అయింది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు వ్యక్తులు సజీవ దహన అయ్యారు. మృతి చెందిన వారిలో మాసు శివయ్య (50), పద్మ (శివయ్య భార్య) (40), మౌనిక (35), హిమ బిందు (2), స్వీటీ (4), శాంతయ్య (40) (సింగరేణి కార్మికుడు) గా గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ స్థానిక పోలీసులతో కలిసి ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు.
16 బృందాలతో దర్యాప్తు
ఆరుగురు సజీవ దహనమైన ఈ ప్రమాద ఘటనపై 16 బృందాలతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ మేరకు డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ, సీఐ ప్రమోదావు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు మొదట వాటిని తరలించే ప్రయత్నం చేశారు. అయితే మృతదేహాలు గుర్తించలేని విధంగా మారిపోవడంతో సంఘటన స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనలో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్, అగ్నిమాపక, ఎలక్ట్రికల్ తదితర డిపార్ట్మెంట్ల అధికారుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీస్తామన్నారు.
బయట వ్యక్తి కారణమని అనుమానాలు!
మంచిర్యాల జిల్లాలో జరిగిన దారుణం ప్రమాదం కాదని పోలీసులు అనుమాన పడుతున్నారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. కావాలనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టారనే అనుమానం వచ్చేలా కొన్ని క్లూస్ పోలీసులకు చిక్కినట్టు సమాచారం. మంచిర్యాల జిల్లా గుడిపల్లి వెంకటాపూర్‌లో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనం అయ్యారు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘట తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. పోలీసు యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. తర్వాత కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు అక్కడ పెట్రోల్ క్యాన్స్ దొరికినట్టు తెలిసింది. అదే టైంలో ఆటో కూడా అనుమానాస్పదంగా వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా... ఒకరు మాత్రం బయట వ్యక్తి. ఆయన పేరు శాంతయ్య. ఈయన కారణంగానే ఇంత దారుణం జరిగిందని స్థానికంగా వినిపిస్తున్న మాట. సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్న శాంతయ్యకు తన కుటుంబంతో విభేదాలు ఉన్నాయట. కొన్ని రోజులుగా ఆయన ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఇంట్లోనే ఉంటున్నారని సమాచారం.