Krishna Road Accident : ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు రక్తమోడింది. గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా(Annamaiah District)లో కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే కృష్ణా జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. మోపిదేవి మండలం కాసానగరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు(Four Died) మృతిచెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం నుంచి మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో ఓ వివాహానికి(Marriage) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పెట్టిన ఫ్లెక్సీ(Flexi) వాహనానికి అడ్డురావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. అవనిగడ్డ డీఎస్పీ మెహబూబ్ బాషా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గుర్రం విజయ(50), బూరేపల్లి రమణ(52), బూరేపల్లి వెంకటేశ్వరమ్మ(50), కోన వెంకటేష్(70) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.



  • ముగ్గురి పరిస్థితి విషమం 


ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన మరో ఏడుగురు క్షతగాత్రులను చల్లపల్లి, మచిలీపట్నం(Machilipatnam)లోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతుల బంధువులు ఫిర్యాదుతో పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహానికి వేడుకకు వెళ్తుండగా అనుకోకుండా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురి మరణంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఎంతో ఆనందంగా పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 



  • అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం


అన్నమయ్య జిల్లాలో ఇవాళ (మే 26) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె సమీపంలోని పుంగనూరు(Punganur) రోడ్డులో ఓ కారు(Car) కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారు పక్కనే ఉన్న మొరవపల్లె చెరువులో పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులు గంగిరెడ్డి, మధులత, కుషితా రెడ్డి, దేవాన్ష్‌ రెడ్డి అని గుర్తించారు.  మృతులు నిమ్మనపల్లె మండలం రెడ్డివారి పల్లెవాసులుగా గుర్తించారు. పలమనేరులో ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా పుంగనూరు రోడ్డులోని 150వ మైలు రాయి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.