Infosys CEO Salil Parekh gets 88 Percent Pay Hike Salary Jumps to Rs 79 Crore Per Annum : ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ (Infosys) సీఈవో సలిల్‌ పారెఖ్‌ వేతనాన్ని భారీగా సవరించింది. ఇంతకు ముందున్న సాలరీని 88 శాతం పెంచింది. దాంతో రూ.42.50 కోట్లుగా ఉన్న ఆయన వేతనం ఇప్పుడు రూ.79.75 కోట్లకు పెరిగింది. ఆ కంపెనీ 2022 ఆర్థిక ఏడాది వార్షిక నివేదిక ద్వారా ఈ విషయం తెలిసింది. సలిల్‌ పారేఖ్‌ను మరో ఐదేళ్ల కాలానికి సీఈవో, ఎండీగా పునర్‌ నియమిస్తూ ఈ మధ్యే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


2022 ఆర్థిక ఏడాదిలో పారేఖ్‌ మొత్తం రెమ్యునరేషన్‌ రూ.71.02 కోట్లుగా ఉంది. అంతకు ముందుతో పోలిస్తే 43 శాతం పెరిగింది. ఈ వేతనంలో రూ.52.33 కోట్ల విలువైన స్టాక్‌ యూనిట్లూ ఉన్నాయి. కొత్త రెమ్యునరేషన్‌ ప్రకారం పారేఖ్‌ పెర్ఫామెన్స్‌ ఆధారిత పరిహారం 77 నుంచి 86 శాతానికి పెంచారు. స్థిర పరిహారం 15 శాతం కన్నా తక్కువగా ఉంటుంది. అంతకు ముందున్న 15 శాతంతో పోలిస్తే ఫిక్స్‌డ్‌ పే 10 శాతానికి తగ్గింది. సమయ ఆధారిత స్టాక్స్‌ 8 నుంచి 4 శాతానికి తగ్గించారు.


సలిల్‌ పారేఖ్‌ వేతనాన్ని భారీగా పెంచడానికి కారణాలను ఇన్ఫోసిస్‌ వార్షిక నివేదికలో వివరించింది. 'సలిల్‌ తొలిసారి సీఈవో, ఎండీగా పనిచేస్తున్న వ్యక్తి కాదు. నియామకానికి ముందు నుంచే ఆ స్థాయిలో ఉన్నారు. ఇన్ఫోసిస్‌ ఒక అంతర్జాతీయ నమోదిత కంపెనీ. దానికి ఆయన సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయన నేతృత్వంలో కంపెనీ చాలా వృద్ధి చెందింది. అంతర్జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టుకొనే ఆయన రెమ్యునరేషన్‌ పెంచాం. అంతర్జాతీయ ఐటీ సంస్థల సీఈవోల వేతనాల సగటు ప్రకారమే ఆయనకు చెల్లిస్తున్నాం' అని ఇన్ఫీ తెలిపింది.


పారేఖ్‌ వేతనాన్ని పెంచేందుకు అసెంచర్‌, కాగ్నిజెంట్‌, డీఎక్స్‌సీ టెక్నాలజీ, టీసీఎస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, క్యాప్‌ జెమినీ, హెచ్‌సీఎల్‌, ఐబీఎం, అటోస్‌ ఎస్‌ఈ వంటి కంపెనీలను ఇన్ఫీ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. '2023 పెర్ఫామెన్స్‌ కింద సలీల్‌కు రూ.34.75 కోట్ల విలువైన 2,21,2000 పీఎస్‌యూలు (స్టాక్స్‌) ఇస్తున్నాం. తొలి ఏడాది ఆయనకు అనుమతించిన బోనస్‌ షేర్లు 2,17,200 (రూ.13 కోట్లు)కు ఇది సమానం. కంపెనీ షేర్ ధర పెరగడంతో ఆయన వేతనం భారీగా పెరిగినట్టు కనిపిస్తోంది' అని అని ఇన్ఫీ వెల్లడించింది.