Kondapalli Hidden Treasures : కృష్ణా జిల్లాలోని కొండ‌ప‌ల్లి రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో గుప్త నిధుల కోసం త‌వ్వకాలు జ‌రిగాయి. అట‌వీ శాఖ అధికారులు నిధులు కోసం త‌వ్వకాలు జ‌రిగిన‌ట్లు గుర్తించారు. ప‌ది మంది ముఠా ఈ త‌వ్వకాల‌కు పాల్పడిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. బంగారం, వ‌జ్రాల‌తో కూడిన భారీ నిధి ఈ ప్రాంతంలో ఉన్నట్లు ప్రచారంలో ఉండ‌టంతో అక్రమార్కులు త‌వ్వకాల‌కు తెగ‌బ‌డిన‌ట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. కొండ‌ప‌ల్లి రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో కొండ మీద ఏడు కిలోమీట‌ర్లు లోప‌ల గ‌ల బెన్ని ఐర‌న్ కోర్ మిల్స్ స‌మీపంలో పెద్ద ఎత్తున త‌వ్వకాలు జ‌రిగాయి.1880లో బ్రిటీష్ వారి హాయాంలో నిర్మించిన ఐర‌న్ కోర్ మిల్స్ స‌మీపంలో గుప్త నిధుల కోసం త‌వ్వకాలు జ‌రిగిన‌ట్లు, అట‌వీ శాఖ అధికారులు గుర్తించారు. అధికారులు సంఘ‌ట‌నా స్థలాన్ని చేరుకునే లోపే కేటుగాళ్లు ప‌రార‌య్యారు. అడవిలో న‌రికిన క‌ర్రల‌తో త‌యారు చేసిన నిచ్చెన‌ను అధికారులు గుర్తించారు. దాన్ని ధ్వంసం చేశారు. పురాత‌న క‌ట్టడాల‌ను ధ్వంసం చేసి 50 అడుగుల లోతున త‌వ్వకాలు నిర్వహించారు. ప‌ది మంది ముఠా ఈ త‌వ్వకాల‌కు పాల్పడి ఉండ‌వచ్చని అట‌వీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ముఠాను త్వర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని అట‌వీ శాఖ అధికారులు వివ‌రించారు.