Kondagattu Accident: జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనగా.. బస్సు కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న ఎనిమిది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దీనికి కొద్ది దూరంలోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే చనిపోయిన కండక్టర్ కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లికి చెందిన సత్తయ్యగా పోలీసులు గుర్తించారు. సత్తయ్య చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి పెద్ద చనిపోవడంతో అనాథలం అయ్యామంటూ ఆయన భార్యా, పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


పవన్ కల్యాణ్ పర్యటన అప్పుడూ ప్రమాదం - యువకుడి మృతి


ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టుకు వచ్చినప్పుడు కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పవన్ కాన్వాయ్ ను ఫాలో అయిన యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఓ యువకుడి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గత నెల 24వ తేదీన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించేందుకు కొండగట్టు వచ్చిన పవన్ కళ్యాణ్, అనంతరం ధర్మపురి వెళ్లారు. నేటి తన పర్యటన పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. కొందరు యువకులు పవన్ కాన్వాయ్ ను ఫాలో అయ్యారు. ఈ క్రమంలో తమ అభిమాన నేత పవన్ కు అభివాదం చేస్తుండగా రెండు బైకులు ఢీకొనడంతో నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తలకు తీవ్ర గాయం కావడంతో దుర్మరణం చెందాడు. మరో ముగ్గురు యువకులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.