RBI - Inflation: 2022 నవంబర్ & డిసెంబర్‌ నెలల్లో దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) తగ్గింది, RBI టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం కంటే దిగువకు వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.88 శాతంగా, డిసెంబర్‌లో 5.72 శాతంగా నమోదైంది. కానీ, కొత్త సంవత్సరం తొలి నెలలో (2023 జనవరి) రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ రెక్కలు చాచి పైకి ఎగిరింది. RBI టాలరెన్స్ బ్యాండ్‌ను మళ్లీ దాటి, భారీగా పెరిగి 6.52 శాతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విఫలమైందా అనే పెద్ద ప్రశ్న తలెత్తుతోంది.


నిజంగానే ఆర్‌బీఐ విఫలమైందా?
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, RBI తన రెపో రేటును 2.50 శాతం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని ‍‌(2022-23) గత 9 నెలల్లోనే పాలసీ రేట్లను 6 దఫాలుగా పెంచింది. అయినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయింది. దీని వల్ల, ప్రజలు కట్టే నెలవారీ కిస్తీలు (EMIలు) ఖరీదుగా మారడం రివాజైంది. అయితే, ద్రవ్యోల్బణం పెరుగుదలను అదుపు చేయలేదని ఆర్‌బీఐని నిందించడం సరికాదని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ పంత్ అభిప్రాయపడ్డారు. దేశంలో సరుకుల సరఫరాలో సమస్యల కారణంగానే భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. ఆహార పదార్థాలతో పాటు పాలు & పాల సంబంధిత పదార్థాల ధరలు భారీగా పెరిగిన కారణంగా చిల్లర ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పారు.


ద్రవ్యోల్బణం తగ్గలేదు, కానీ EMI పెరుగుతోంది
2022 ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.80 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత, 2022 మే నెల 4న, ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారి పాలసీ రేటును RBI మార్చింది, రెపో రేటును పెంచింది. వడ్డీ రేటు పెంపు వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆర్‌బీఐ అప్పుడు చెప్పింది. కానీ ద్రవ్యోల్బణం మాత్రం 7 శాతానికి పైగానే కొనసాగింది. అప్పటి నుంచి ప్రతి మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును ఆర్‌బీఐ పెంచుతూ వెళ్లింది. 2022 మే 4వ తేదీకి ముందు రెపో రేటు 4 శాతంగా ఉండేది. రెపో రేటును దఫదఫాలుగా పెంచుతూ వచ్చిన ఆర్‌బీఐ, తాజాగా, 2023 ఫిబ్రవరి 8న, రెపో రేటును మరో పావు శాతం పెంచింది. దీంతో, ఇప్పుడు రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. ఈ వడ్డీ రేటు పెంపును ప్రకటించిన నాలుగు రోజులకే 2023 జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం డేటా వచ్చింది. జనవరిలో చిల్లర ద్రవ్యోల్బణం ఆరున్నర శాతం దాటి 6.52 శాతానికి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును ఆరు సార్లు పెంచడం వల్ల ప్రజలపై EMIల భారం పెరిగింది తప్ప, ద్రవ్యోల్బణం మాత్రం అదుపులోకి రాలేదు.


కేవలం వడ్డీ రేట్లు పెంచుతూ వెళ్లడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గదని ప్రొఫెసర్ మనోజ్ పంత్ చెప్పారు. ఇకపై, వడ్డీ రేట్లను పెంచడం గురించి ఆర్‌బీఐ ఆలోచించకూడదని, లేకుంటే దేశంలో వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ ద్రవ్యోల్బణం ఆహార ఉత్పత్తుల వల్ల వచ్చిందేనని, వడ్డీ రేట్లను పెంచడం ద్వారా దానిని నియంత్రించలేమని ఆయన చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులు, ముఖ్యంగా డీజిల్ ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని వివరించారు. అధిక ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం చివరి వరకు, అంటే శీతాకాలం వరకు కొనసాగవచ్చని అంచనా వేశారు.


ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తమ వడ్డీ రేట్లను పెంచడంతో, విదేశీ పెట్టుబడులు భారత్‌ నుంచి బయటకు వెళ్లకుండా మన దేశంలోనూ వడ్డీరేట్లను RBI పెంచుతోందని ప్రొఫెసర్ మనోజ్ పంత్ చెప్పారు. ఆర్‌బీఐ తదుపరి ద్రవ్య విధాన సమీక్ష (MPC) కొత్త ఆర్థిక సంవత్సరంలో (2023-24) జరుగుంది. ఏప్రిల్ 3, 5, 6 తేదీల్లో ఎంపీసీ సమావేశం ఉంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో, రెపో రేటును ఆర్‌బీఐ ఇంకా పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి.


ప్రధాన ద్రవ్యోల్బణం సమస్యను పెంచింది
2023 ఫిబ్రవరి 12, శనివారం నాడు జరిగిన బోర్డు సమావేశం తరువాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు దాదాపు 5.3 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. ముడి చమురు ధరల్లో తగ్గుదల ఉంటే, మన దేశం ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని వెల్లడించారు.