Konaseema Road Accident : కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం యానం-ఎదుర్లంక బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. బైక్ ను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారికి గాయాలు అవ్వగా, మృతుల్లో ఒక చిన్నారి ఉన్నాడు. వారధిపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఐ.పోలవరం, యానం పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. గాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. ఎదుర్లంక బాలయోగి వారధిపై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మోటార్ సైకిల్ పై వెళుతుండగా టిప్పర్ లారీ ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో మరణించింది. మృతులు కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామం చెందినవారుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తేజ శ్రీలక్ష్మి(5) మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.


మృతుల వివరాలు 


గుబ్బల శ్రీను (45)
గుబ్బల మంగయమ్మ (40)
మనవడు  యశ్వంత శివ కార్తీక్ (3సం)
మనవరాలు శ్రీ లక్ష్మి (6సం) 


గుబ్బల శ్రీను పెద్ద కూతురు  ద్రాక్షారామ ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


చెట్టును ఢీకొట్టిన కారు, 8 మందికి గాయాలు 


శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి రోడ్డుపక్కన చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ జిల్లాలోని సింహాచలం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని కంచికి ఎనిమిది మంది ఇన్నోవా కారులో బయలుదేరారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా పలాసపురం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాహనం అదుపుతప్పి రోడ్డుపై కిందకు దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందించిన వైద్యులు ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణంగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


మానవత్వం చాటుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ 


రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన సొంత వాహనంలో తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆదివారం మంత్రి  గుడివాడ అమర్నాథ్ లంకెలపాలెం నుంచి అనకాపల్లి వైపు వెళ్తుండగా మార్గమధ్యలో నేషనల్ హైవేపై జరిగిన బైక్ ప్రమాదాన్ని గమనించి, వెంటనే అక్కడకు వెళ్లి ప్రమాదం జరిగిన వ్యక్తులను మంత్రి కారులో దగ్గర ఉన్న అనకాపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. అక్కడే ఉన్న స్థానికులు మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.