Nellore News : ఓవైపు కొత్తగా మంత్రి అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి తొలిసారి నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. ఆయనకు స్వాగత సత్కారాలు, సన్మానాల కోసం భారీ ఎత్తున పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నారు. మరోవైపు నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సభ ఏర్పాటుచేశారు. ఇప్పుడు నెల్లూరు పోలీసుల పరిస్థితి విచిత్రంగా మారింది. ఇద్దరూ పోటా పోటీగా సభలు, ర్యాలీలు పెట్టుకోవడంతో పోలీసులకు రెండ్రోజులుగా కంటిమీద కునుకులేదు. ఇద్దరి కార్యక్రమాలు ఒకే రోజు, ఒకే టైమ్ కి కావడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భారీగా నెల్లూరు నగరంలో పోలీసుల్ని మోహరించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఎస్సైలను, సీఐలను పిలిపించి నగరంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్పెషల్ పార్టీ ఫోర్స్ కి కూడా ఈరోజు నెల్లూరులో డ్యూటీలు వేశారు. మొత్తమ్మీద నెల్లూరు పొలిటికల్ హీట్ తో ఖాకీలకు పని ఒత్తిడి పెరిగింది. జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలతో నగర, రూరల్ డీఎస్పీలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 


అధిష్టానం సీరియస్


నెల్లూరు వైసీపీలో వర్గపోరుపై అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. ఎవరి కార్యక్రమాలు వాళ్లు నిర్వహించుకోవాలని సూచించింది. అంతేగానీ ఒకరిపై ఒకరు విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని తెలిపినట్లు సమాచారం. ఎవరైనా అధిష్టానం మాట వినకుండా గీత దాటితే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. నెల్లూరులో ఇవాళ జరగబోతున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Kakani Goverdhan Reddy) స్వాగత ర్యాలీ, అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తలపెట్టిన కార్యకర్తల సభపై అధిష్ఠానం దృష్టి సారించింది. పోటా పోటీగా ఈ రెండు కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇప్పటికే మాటల తూటాలు పేలాయి, ఫ్లెక్సీలు చిరిగాయి. దీనికి సంబంధించి గొడవ జరిగే అవకాశం ఉండటంతో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజీ ప్రయత్నం జరిగినట్టు సమాచారం. 


సిటీలో మాజీ మంత్రి సభ 


అనిల్ కుమార్ యాదవ్ సభ సాయంత్రం 4 గంటలకు ఉంది. రాత్రి వరకు అది జరిగే అవకాశం ఉంది. కార్యకర్తలతో మీటింగ్ అనుకున్నారు కానీ, అది నగరం నడిబొడ్డున గాంధీ బొమ్మ సెంటర్ లో పెట్టుకున్నారు. ఈ సభ వల్ల కాకాణి ర్యాలీ నెల్లూరు టౌన్ లోకి ఎంటరయ్యే అవకాశం లేదు. గతంలోనే ఈ సభకు ఏర్పాట్లు చేసుకున్నానని, పర్మిషన్ కూడా తీసుకున్నానని అనిల్ చెప్పడంతో సభ వరకు అధిష్ఠానం ఓకే చెప్పింది. అయితే సిటీ వరకే సభను పరిమితం చేసుకోవాలని సూచించారని సమాచారం. 


మినీ బైపాస్ లో కొత్త మంత్రి ర్యాలీ 


మంత్రి పదవి వచ్చిన తర్వాత తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వస్తున్న కాకాణి గోవర్దన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కావలి నియోజకవర్గం నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత నెల్లూరు నగరంలో కూడా కాకాణి ర్యాలీ ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అనిల్ సభతో అది కుదిరేలా లేదు. దీంతో కాకాణి ర్యాలీని మినీ బైపాస్ రోడ్డుకి పరిమితం చేయబోతున్నారు. మినీ బైపాస్ పై కాకాణి ర్యాలీగా వచ్చి తన ఇంటికి వెళ్తారు.