Konaseema District News: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో గత నెల రెండో తేదీన హైస్కూల్ విద్యార్థి అదృశ్యమై రెండ్రోజుల తర్వాత శవంగా మారిన విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతూ.. విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. రోడ్డుపై వాహనాలను వెళ్లనీయకుడా అడ్డుగా నిలబడ్డారు. విద్యార్థి మృతి కేసును హత్యా కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతి పై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది.
గత నెల రెండవ తారీఖున అంబాజీపేట హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న మట్టపర్తి రాజేశ్వరరావు స్కూల్ నుంచి అదృశ్యం అయ్యాడు. రెండు రోజుల తర్వాత స్థానిక కొర్లపాటి వారిపాలెం వనుములమ్మ గుడి సమీపంలోని మురుగు కాలవలో శవమై తేలాడు. అయితే ఇప్పటి వరకు కేసును ఎటు తేల్చకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, దుర్గాభవాని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అంబాజీపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అయితే వీరితో పాటు శెట్టిబలిజ సంఘం, వివిధ పార్టీ నాయకులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. స్కూల్ నుంచి బయటికి వెళ్లిన విద్యార్థి అదృశ్యమై, మురుగు కాలవలో బట్టలు లేకుండా శవమై తేలడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
కావాలనే పోలీసులు నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారు..
పోస్టుమార్టం రిపోర్టులో విద్యార్థిని హత్య చేసినట్లుగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోలీసులు దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కూడా ఇందులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. సీసీ టీవీ ఫుటేజీలో కనిపించిన మిగతా విద్యార్థులను బయటకు రానివ్వకుండా కేసును నీరుగారుస్తున్నారన్నారు. ప్రత్యేక అధికారి ద్వారా హత్యా కోణంలో కేసును దర్యాప్తు చేయాలన్నారు. కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకూ ధర్నా ఆపేది లేదని హచ్చరించారు.
ఇటీవలే కడప విద్యార్థిని అదృశ్యం..
బద్వేల్ పట్టణంలోని గోపిరెడ్డి స్కూర్ లో ఏడో తరగతి చదువుతున్న వెంకట సంజన.. రోజూలాగే శుక్రవారం ఉదయం బడికి వెళ్లింది. స్కూలు అయిపోయాక బడి నుంచి బయటకు వచ్చిన సంజన.. ఇంటికి కూడా వెళ్లలేదు. అయితే సాయంత్రం గడుస్తున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడ్డ తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులకు ఫోన్ చేశారు. అయితే సంజన బడి అయిపోగానే బయటకు వెళ్లిందని చెప్పడంతో తల్లిదండ్రుల్లో మరింత టెన్షన్ మొదలైంది. ఆమె స్నేహితులు, బంధువులు, తెలిసన వాళ్లందరికీ ఫోన్ లు చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాలన్నీ గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో.. ఇక లాభం లేదనుకొని పోలీసులను ఆశ్రయించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సంజన కనిపించకుండా మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే తమ కూతురుకు ఏం జరిగిందోనని తల్లిదండ్రులు చాలా భయపడిపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. ఎలాగైనా సరే తమ కూతురును తమ చెంతకు చేర్చమంటూ పోలీసులను వేడుకుంటున్నారు.