Amalapuram Violence : కోనసీమ జిల్లా అమలాపురంలో పోలీస్‌ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 307,143,144 తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సామర్లకోటకు చెందిన కానిస్టేబుల్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు. వడగాన నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, దున్నాల దిలీప్‌, అడపా శివ, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్‌, లింగోలు సతీష్‌, నల్ల నాయుడుతో సహా మొత్తం 46 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి కొందరి కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎర్ర వంతెన వద్ద బస్సును దగ్ధం చేసిన కేసులో 46 మందిపై మరో ఎఫ్‌ఐఆర్‌ అమలాపురం పీఎస్‌లో నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్‌ గిరిబాబు ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 



  • కొనసాగుతోన్న అరెస్టుల పర్వం 


అమలాపురంలో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇంకా అమలాపురం పట్టణం పోలీసుల వలయంలోనే ఉంది. సోషల్ మీడియా వేదికగా అల్లర్లు ప్రేరేపిత చర్యలు జరగకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అధునాతన సాంకేతిక పద్ధతులు ఉపయోగించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అమలాపురంలో జరిగిన విధ్వంస ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎస్పీల ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు కొనసాగుతోంది.  ఈ విధ్వంసానికి సంబంధించి ఇప్పటి వరకు 46 మంది అరెస్ట్ అయ్యారు.  సామర్లకోటకు చెందిన కానిస్టేబుల్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్టైన 46 మందిలో అమలాపురం పట్టణానికి చెంందిన పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచంద్రరావు కుమారుడు నల్లా అజయ్ పేరు కూడా ఉంది. గడియారపు స్తంభం సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చిన అల్లవరం వైసీపీ దళిత నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున అక్కడి నుంచి పంపించేశారు. అరెస్టుల పర్వంపై అమలాపురంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. 



  • రెచ్చిపోయిన ఆందోళనకారులు 


కోనసీమ జిల్లా పేరు మార్చడంపై ఇటీవల చిన్నాగా ప్రారంభమైన ఆందోళన హింసాత్మకంగా మారింది. మొదట పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు క్రమంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తొలుత మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటిని ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిపైకి దూసుకెళ్లారు. కలెక్టరేట్‌ ముట్టడి పేరుతో కోనసీమ జిల్లా జేఏసీ చేపట్టిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా పేరు మార్పును అంగీకరించబోమంటూ ఉద్యమించారు. ముఖ్యంగా యువత ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ఆందోళన వద్దని పోలీసులు వేడుకుంటున్నా ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ఓ దశలో లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం భయపడలేదు. లాఠీ దెబ్బలతో మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు కాస్త ఆందోళకరంగా సాగిన ముట్టడి రక్తసిక్తమైంది.