భారతీయ క్రికెట్ చరిత్రలో మే 26వ తేదీకి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే వన్డేలు, టెస్టులు ఇలా రెండు ఫార్మాట్లలోనూ టీమిండియా ఆటగాళ్లు రెండు ముఖ్యమైన రికార్డులు నెలకొల్పారు. వీటిలో టెస్టు ఫార్మాట్లో వచ్చిన రికార్డు అయితే ఇప్పటికీ అన్‌బ్రేకబుల్. ఎంతో ప్రత్యేకమైన రికార్డు కూడా.
అదరగొట్టిన టాప్-4
2007, మే నెల. వేదిక ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియం. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం చారిత్రక రికార్డుకు దారి తీస్తుందని బంగ్లాదేశ్ ఆటగాళ్లు అస్సలు ఊహించి ఉండరు. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి ఏకంగా 610 పరుగులు చేసింది. ఏకంగా 153 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఇందులో టీమిండియా రికార్డు అంటే... జట్టు భారీ స్కోరు సాధించడం కాదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాప్-4 బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ (129: 212 బంతుల్లో, 16 ఫోర్లు), వసీం జాఫర్ (138: 229 బంతుల్లో, 17 ఫోర్లు), రాహుల్ ద్రవిడ్ (129: 176 బంతుల్లో, 15 ఫోర్లు, ఒక సిక్సర్), సచిన్ టెండూల్కర్ (122 నాటౌట్: 226 బంతుల్లో, 8 ఫోర్లు, ఒక సిక్సర్) నలుగురూ సెంచరీలు బాదేశారు. అంతకు ముందు ఆ తర్వాత ఎవరూ ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 239 పరుగులతో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది.
దుమ్ముదులిపిన దాదా, ద్రవిడ్
కేవలం టెస్టుల్లో మాత్రమే కాకుండా వన్డేల్లో కూడా మే 26వ తేదీన టీమిండియాకు ప్రత్యేకమైన రికార్డు ఉంది. అది కూడా వరల్డ్‌కప్‌లో. 1999 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు దింపింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ శఠగోపన్ రమేష్ అవుట్ కావడంతో ఆరు పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
ఈ వికెట్ తీయడమే తాము చేసిన తప్పని శ్రీలంకకు అప్పుడు తెలియలేదు. అప్పటికి క్రీజులో ఉన్న ఓపెనర్ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీకి మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ జత కలిశాడు. వీరిద్దరూ దాదాపు 45 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఏకంగా 318 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డేల్లో మొదటి 300 పరుగుల భాగస్వామ్యం ఇదే. ఈ మ్యాచ్‌లో గంగూలీ 158 బంతుల్లో 17 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 183 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ 129 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 145 పరుగులు చేశాడు. సౌరవ్ గంగూల్ వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరును ఈ మ్యాచ్‌లోనే సాధించాడు. అయితే తర్వాతి కాలంలో ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ 331 పరుగుల భాగస్వామ్యంతో ఈ రికార్డును బద్దలు కొట్టారు. వీరి రికార్డు మాత్రం ఏకంగా 16 సంవత్సరాల పాటు నిలిచింది.
2015లో క్రిస్ గేల్, మార్లోన్ శామ్యూల్ రెండో వికెట్‌కు 372 పరుగుల భాగస్వామ్యంతో ఈ రికార్డును బద్దలు కొట్టారు. ప్రస్తుతం వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాల్లో సచిన్, ద్రవిడ్ భాగస్వామ్యం మూడో స్థానంలోనూ, గంగూలీ, ద్రవిడ్ భాగస్వామ్యం నాలుగో స్థానంలోనూ ఉన్నాయి.