Konaseema District Crime News: కామంతో కళ్లు మూసుకుపోయిన కామంధులు బరితెగిస్తున్నారు. మాయ మాటలు చెప్పిన ఓ బాలికను నిర్మానుస్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఐదుగురు దుండగులు.. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితును అరెస్ట్ చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. 


అసలేం జరిగిందంటే..?


డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక.. ఈనెల 6వ తేదీన బట్టలు ఉతికేందుకు తీరప్రాంతంలో ఉన్న సరుగుడు తోటల మధ్యకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఐదుగురు యువకులు ఆమె వెంటే వెళ్లారు. సదరు బాలికతో మాట కలిపారు. మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న గుబురు పొదల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఐదుగురూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారంతా పారిపోయారు. తీవ్ర అస్వస్థతతకు గురైన బాలిక ముక్కుతూ, మూలుగుతూ చాలా కష్టంగా ఇంటికి చేరుకుంది. అయితే బాలిక అలా ఉండడంతో ఏమైందని ప్రశ్నించిన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని తెలిపింది. అయితే అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు యువకులు అధికార పార్టీకి చెందిన నాయకుల కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దారుణానికి ఒడిగట్టిన నిందితులు బాధిత కుటుంబాన్ని బెదిరించడం మొదలు పెట్టారు.


లక్ష రూపాయలిస్తాం విషయం మర్చిపొమ్మని చెప్పిన నిందితులు..!


అయినా సరే తమ కూతురు జీవితాన్ని నాశనం చేసిన వారిని ఎలాగైనా శిక్షించాలని తల్లిదండ్రులు గ్రామ పెద్దలను కలిసి విషయం తెలిపారు. పంచాయతీ పెట్టించారు. అయితే లక్ష రూపాయలు ఇస్తాం విషయం మర్చిపోమ్మని నిందితుల తల్లిదండ్రులు చెప్పగా.. అందుకు బాలిక కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇక వీళ్లకు చెప్పి లాభం లేదనుకొని బాధిత కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గురువారం డీఎస్పీ వై.మాధవ రెడ్డి సిబ్బందితో వెళ్లి విచారణ చేపట్టారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక తండ్రి  ఫిర్యాదు మేరకు సర్పంచ్ కుమారుడు ఓలేటి తేజ, ఓలేటి తులసిరావు (తులసి), మల్లాడి వంశీ, ఓలేటి ధర్మరాజు, అర్థాని సత్తిపండులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు కాట్రేని కోన ఎస్ఐ పి.శ్రీనివాస్ తెలిపారు.


ఘటనపై మహిళా కమిషన్ సీరియస్


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డితో చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికార పార్టీకి చెందిన నేతల పిల్లలు అయినా సరే, వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా సరే కచ్చితంగా శిక్ష పడేలా చేయాలని కోరారు. అలాగే బాధితురాలికి అండగా ఉండాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ... మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ కోరారు.