మండపేట: విద్యాలయాలు సరస్వతి నిలయాలు అంటారు.. చదువు చెప్పే విద్యా సంస్థలను పవిత్రమైన దేవాలయంతో పోల్చుతారు.. అటువంటి విద్యాలయాల్లోనే బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. తండ్రి స్థానంలో నిలిచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడై పాఠశాలలోని విద్యార్థులపై తన వికృత బుద్దిని చూపాడు. కూతురు వయస్సున్న బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకుని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ప్రిన్సిపాల్ చేసిన లైంగిక దాడితో బాలిక గర్భం దాల్చడంతో ఆ కామాంధుడి చేష్టలు బట్టబయలయ్యాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు స్కూల్ ప్రిన్సిపాల్ షాజి జయరాజ్‌ను అదుపులోకి తీసుకుని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
మాయమాటలతో విద్యార్థినిని లొంగదీసుకుని..
మాస్టారు అంటే పిల్లలందరికీ గౌరవం, అంతకంటే అభిమానం.. అందుకే ఆ బాలిక ఎక్కడ లేని వినయం, విధేయత చూపింది. ఇదే అదనుగా తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలికను మాయమాటలతో తన ఛాంబర్‌కు తరచూ పిలిపించుకుని మాట్లాడేవాడు. ఈ క్రమంలోనే మాటలు కాస్త వికృత చేష్టలుగా మారాయి. ప్రిన్సిపాల్ అసలు స్వరూపం తెలుసుకునేలోపే అతడి బారిన పడింది. ఆ బాలిక అతని చేష్టలను కూడా ఎవ్వరికీ చెప్పుకోలేక పోయింది. ఇదే ఆసరాగా తీసుకున్న ప్రిన్సిపాల్ జయరాజ్ నాలుగు నెలల కిందట ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అత్యాచారం విషయం చెబితే చంపేస్తానని బెదిరింపు..
బాలికను లొంగదీసుకున్న ప్రిన్సిపాల్ జయరాజ్ అత్యాచారం చేసి ఆపై దీని గురించి ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక తల్లి తండ్రలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ చేసిన పాడు పని ఎవ్వరికీ చెప్పుకోలేని బాలిక తనలో తాను మానసిక వేదన అనుభవించింది. ఆ తరువాత కూడా అదను చూసుకుని బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ బాలిక చెబుతోంది.
మూడు నెలలుగా నెలసరి రాకపోయేసరికి..
బాలిక శరీరంలో మార్పులతో పాటు మూడు నెలలుగా పీరియడ్స్ రాకపోవడంతో తల్లిదండ్రులు బాలికను మండపేటలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చూపించారు. బాలిక మూడు నెలలు గర్భవతిగా నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు షాకయ్యారు. దీంతో బాలికను నిలదీసిన తల్లితండ్రులకు అసలు విషయం చెప్పింది. నాలుగు నెలల క్రితం స్కూల్ ప్రిన్సిపాల్ జయరాజ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పడంతో బాధిత బాలిక తల్లితండ్రులు రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక తల్లితండ్రలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రయివేటు స్కూల్ ప్రిన్సిపాల్ షాజి జయరాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది..