మనిషి శరీరానికి మధ్యలో కట్టే తాడు మొలతాడు
చేత వెన్నముద్ద చెంగల్వ పూదండబంగరు మొలతాడు పట్టుదట్టిసందె తాయతులును సరిమువ్వ గజ్జెలుచిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు
ఇది చదవగానే... పట్టువస్త్రం, నడుముకి బంగారు మొలతాడుతో చిన్ని కృష్ణుడి రూపం కళ్లముందు కనిపిస్తుంది. మొలతాడు గురించి అంత ప్రత్యేకంగా ప్రస్తావన ఉంటుంది.
ధర్మ సింధువు ప్రకారం
మౌంజీం యజ్ఞోపవీతంచ నవదండంచ ధారయేత్‌అజినం కటిసూత్రంచ నవ వస్త్రం తదైవచ ॥
'దర్భ తాడును, జంధ్యాన్ని, ఊతగా వినియోగించే మోదుగ కర్ర, జింక చర్మం, మొలత్రాడు, వస్త్రం...ఇవన్నీ ప్రతి సంవత్సరం కొత్తగా ధరించాలని అర్థం.
పైన శ్లోకంలో ఉన్న కటిసూత్రం అంటే మొలతాడు. ఇది ఆరోగ్య భద్రతకోసం పెట్టిన పురుష ఆభరణం.
మనిషి శరీరం రెండు భాగాలుగా ఉంటుంది1. నడుము పైభాగం దేవభాగం2. నడుము కిందభాగం రాక్షసభాగం
దేవభాగాన్ని ఉత్తమమైన బంగారంతో కానీ అంతకన్నా శ్రేష్ఠమైన నవరత్నాలతో కానీ అలంకరించాలని చెబుతోంది సనాతన ధర్మంమిగిలిన రాక్షస భాగంలో వెండిని వినియోగించవచ్చు కానీ బంగారం వాడరాదు. మొలతాడు కట్టిన పై భాగం అలంకారం... పూజా పునస్కారాలకు సంబంధించింది అని చెప్పడమే అంతరార్ధం
శరీరాన్ని మధ్యగా బాహ్యరూపంలో విభజించి చూపిస్తుంది మొలతాడు. శరీరానికి సంగమ స్థానం నడుము... అందుకే ఈ భాగంలో బంగారం, వెండి, దారం..ఇలా ఎవరిస్థాయి ఆధారంగా వారు మొలతాడు కట్టుకోవచ్చు.
మొలతాడు కట్టుకునేందుకు సాధారణంగా ఎరుపు, నలుపు దారాన్ని వినియోగిస్తారు
మొలతాడు మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తది కట్టిన తర్వాతే పాతది తొలగిస్తారు..ఒక్క క్షణం కూడా మొండి మొల ఉండకూడదు అని చెబుతారు పెద్దలు
మొలతాడు ఎందుకు?
దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలేంటి? మొలతాడు అలంకారానికి సంబంధించిన వస్తువు కానేకాదు..ఇది కట్టుకుంటే దుష్టశక్తుల నుంచి ప్రభావం ఉండదు చిన్నారులకు దిష్టి తగలకుండా మొలతాడు కడతారు..నల్లటి మొలతాడుతో పాటూ నలుపు, ఎరుపు పూసలు కట్టడం వెనుక కారణం ఇదే
శరీరాన్ని మధ్యగా దిష్టి తగలకూడదని మొలతాడు కడతారు. చిన్నారులకు మొలతాడుకి రంగురంగుల పూసలు కట్టడం వెనుక కారణం ఇదే.
జాతక రీత్యా ఉండే దోషం తగ్గేందుకు , దుష్టశక్తుల నుంచి రక్షణకోసం కట్టే తాయెత్తులు మొలకు కట్టేది కూడా ఇందుకే
నల్లటి తాడుని మొలకి కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చిన్నారులకు మొలతాడు కడితే వాళ్ళు పెరుగుతున్న సమయంలో ఎముకలు ,కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
మగవారికి జననాంగం ఆరోగ్యంగా పెరుగుతుంది చిన్నారులుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా మొలతాడు కడతారు.. రజస్వల అయ్యేవరకూ ఉంచి ఆ తర్వాత తీసేస్తారు. వివాహిత స్త్రీకి మెడలో మంగళసూత్రం ఎంత ముఖ్యమో..పురుషులకు మొలతాడు అంతే ముఖ్యం. మొలతాడు లేని పురుషులను భార్య చనిపోయిందా అని ప్రశ్నించేవారట. ఇప్పుడంటే వైద్య పరిజ్ఞానం పెరిగింది కానీ అప్పట్లో చుట్టుపక్కల లభించే ఆకులు, వేర్లనే వైద్యానికి వినియోగించేవారు. ఏవైనా విష పురుగులు కుట్టినప్పుడు వెంటనే మొలతాడు బిగించి ఆ విషయం శరీరం పైకి పాకకుండా చేసి బయటకు తీసేవారు.
మొలతాడు ధరించడం వల్ల తీసుకునే ఆహారం విషయంలో నియంత్రణ ఉంటుంది. బిగుసుకుపోతున్న మొలతాడు పొట్ట పెరుగుతోందని చెప్పేందుకు ఓ సంకేతం..అంటే ఆహరపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిందే అనే హెచ్చరిక ఇది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బానపొట్టని నివారిస్తుంది మొలతాడు ధరించేవారికి హెర్నియా , వెన్నుకు సంబంధించిన సమస్యలు రావని చెబుతారు పెద్దలు.
భవిష్యత్ లో వచ్చే ఎన్నో వ్యాధులకు బొడ్డు మూలకణాలు పరిష్కారం..ఇప్పుడు స్టెమ్ సెల్స్ థెరపీ ఇదే... అందుకే అప్పట్లో బొడ్డుని తాయెత్తుగా చేసి మొలతాడుకి కట్టేవారు.
ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయ్.. హిందూ సంప్రదాయంలో భాగంగా అనుసరించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలున్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటారు పండితులు.
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది