Rebbena SI : కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెబ్బెన ఎస్సై భవానీ సేన్ పోలీసు ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎస్సై భవాని సేన్ యువతికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించి, పుస్తకాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేలా చేస్తామని మాయమాటలు చెప్పి, అసభ్యంగా ప్రవర్తించారని యువతి ఆరోపించింది. ఎస్సై ప్రవర్తనతో ఆందోళన చెందిన యువతి సమీప బంధువులకు చెప్పడంతో వాళ్లు ఎస్సై పై  ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్సైని వీఆర్ కు అటాచ్ చేశారు. గతంలో కూడా WPC లతో ఎస్సై ఇలాగే  ప్రవర్తించేవారని ఆరోపణలు ఉన్నాయి. 


ఎస్సై వీఆర్ కు అటాచ్ 


ఎస్సై భవాని సేన్ పై కొన్నాళ్లుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉన్నత అధికారులు ఈ ఘటనను సీరియస్ గా విచారణ చేశారు. మీడియాతో మాట్లాడిన బాధిత యువతి భవిష్యత్తులో తనకు ఎటువంటి అపాయం లేకుండా చూస్తామని పోలీస్ ఉన్నతాధికారులు భరోసా ఇవ్వడంతో యువతి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. రెబ్బెన ఎస్సై భవానీ సేన్ గౌడ్ నుంచి యువతి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఘటనతో ఎస్సైను VRకు అటాచ్ చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఎస్సై భార్య హేర్ డై తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. 


సీఐ నాగేశ్వరరావు అక్రమాలు


హైదరబాద్ లో ఓ వివాహితను గన్ తో బెదిరించి అత్యాచారం చేసిన మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూకబ్జా వ్యవహరంలోనూ నాగేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్లు తాజాగా వెలుగుచూసింది. వందల కోట్ల విలువైన బంజారాహిల్స్ భూకబ్జా కేసులో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని అతి తక్కువ ధరకే కొట్టేయాలని భావిస్తున్న ఓ ప్రైవేటు సంస్థకు సీఐ నాగేశ్వరరావు అండగా నిలిచి కేసుని తారుమారు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 



తాజాగా నాగేశ్వరరావు దుర్మార్గాలు వెలుగులోకి రావడంతో తమకు జరిగిన అన్యాయంపై బాధితులు గళం విప్పారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయంటూ తమని వేధించిన సీఐ నాగేశ్వరరావుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులకు, నాయకులకు కోట్ల రూపాయలు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాను, కాబట్టి నాకు కూడా అంతే డబ్బులు రావాలి అంటూ ప్రచారం చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఐను విధుల నుంచి తొలిగించి కేసు నమోదు చేశారు. తాజాగా ఎస్ఓటీ పోలీసులు పరారీలో ఉన్న సీఐ నాగేశ్వరరావును అరెస్టు చేశారు.