ఏపీలో వ్యవసాయ రంగంలో చేపడుతున్నకార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ ప్రశంశించారు. ఇ–క్రాపింగ్‌ విధానం అత్యంత వినూత్నమైన‌దని ఆయ‌న పేర్కొన్నారు. ఏపీలో వ్య‌వ‌సాయ రంగంలో అమ‌లు అవుతున్న కార్య‌క్ర‌మాల‌ను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కొనియాడారు. ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ విషయలోనూ ఏపీ స్ఫూర్తిదాయకంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని జ‌గ‌న్ సూచనల మేరకు మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు చేస్తామన్నారు తోమర్. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, దిల్లీ నుంచి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, ఇతర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


కేంద్రమంత్రితో సీఎం జగన్‌ ఏమన్నారంటే.. ఫసల్‌ బీమా యోజన అందరికీ వర్తింపు చేయాలంటే విధానపరంగా మార్పు రావాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,444 ఆర్బీకేలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతాయి. అగ్రికల్చర్‌ అసిస్టెంట్, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లు ఆర్బీకేల్లో పనిచేస్తున్నారు. గ్రామ సచివాలయాలతో కలిసి ఆర్బీకేలు పని చేస్తున్నాయి. రైతులు సాగు చేసిన ప్రతి పంటను కూడా జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్‌ చేస్తున్నామ‌న్నామని అన్నారు సీఎం జ‌గ‌న్.


"చాలా దృఢమైన వ్యవస్థ ద్వారా డేటాను సేకరిస్తున్నాం, అందుబాటులో ఉన్న ఇ– క్రాప్‌ డేటాను వినియోగించుకోవాలి. రైతు సాగుచేస్తున్న ప్రతి పంట కూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాం, రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించాల్సిందే కాదు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. మూడింతల్లో ఒక వంతు రైతులు చెల్లించాల్సిన దాన్ని, మరో వంతు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియంను మొత్తంగా మూడొంతుల్లో రెండొతులు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్న విష‌యాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. ఆర్దిక పరిస్థితి స‌హ‌రించ‌క‌పోయినా, అందరికీ పంట బీమా పరిహారం అందాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోందని వెల్ల‌డించారు. లేకపోతే సాగు చేస్తున్న ప్రతి రైతు కూడా పంటలబీమా పరిధిలోకి రారని, ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించడం ద్వారా, రైతు సాగుచేసిన ప్రతి పంటనూ ఇ–క్రాపింగ్‌ చేయడం ,ఉచిత పంటల బీమా పథకం అద్భుతంగా ముందుకు సాగుతుందన్నారు. సన్న, చిన్నకారు రైతులు తరఫున చెల్లించాల్సిన ప్రీమియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటి భరిస్తే, మరిన్ని అద్భుతాలు జరుగుతాయిని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు.


వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తొమర్‌ ఏమన్నారంటే.. "సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాలు కాపాడడంలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్, ఇద్దరూ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నారు. రైతులకు మేలు చేయడంలో కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. అవి రైతులకు కచ్చితంగా లాభిస్తున్నాయి. వ్యవసాయం బాగుండి, రైతుల ఆదాయం పెరిగితే, దేశంతో పాటు, రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకే ఆ దిశలో కేంద్రం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.


"రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ప్రకటించినప్పుడు, అన్ని రాష్ట్రాలు అందులో భాగస్వామ్యం అయ్యాయి. అయితే ఏదైనా కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు, కొన్ని లోటుపాట్లు ఎదురవుతాయి. సమస్యలూ వస్తాయి. ఆ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, సలహాల మేరకు ఫసల్‌ బీమా యోజనలో అవసరమైన మార్పులు చేశాం. రాష్ట్రంలో వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అమలు చేస్తున్న ఈ–క్రాప్‌ విధానం గురించి తెలిసింది. అది దేశంలోనే ఒక వినూత్న ప్రక్రియ. దాని గురించి తెలుసుకున్న తర్వాత, అది రైతులకు ఏ స్థాయిలో మేలు చేస్తుందన్నది అర్థం చేసుకున్న తర్వాత ఎంతో సంతోషం కలిగిందని" కేంద్రమంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.


ఎక్కడైనా ఒక గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తే, అది మిగతా  రాష్ట్రాల్లో  కూడా అమలు చేయడం అవసరమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు కేంద్రమంత్రి. త్వరలోనే రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రుల సమావేశం నిర్వహించబోతున్నామ‌ని, రైతుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ–క్రాప్‌ విధానంతోపాటు, వినూత్న కార్యక్రమాలు, పథకాలను ఆ సమావేశంలో వివరిస్తామన్నారు. అవి అన్ని రాష్ట్రాలకు ఎంతో ప్రేరణనిస్తాయన్నారు.