Nara Brahmini: సామాజిక మాధ్యమంలో నారా బ్రాహ్మిణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని ఖమ్మం టీడీపీ నాయకులు గురువారం చితక్కొట్టారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి ఖమ్మం టేకులపల్లిలో ఆర్ంపీగా పని చేస్తున్నారు. తన ఫేస్ బుక్ లో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు కోడలు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మిణిపై అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా కించపరుస్తూ పోస్టులు పెట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కేతినేని హరీష్, నల్లమల రంజిత్, నున్నా నవీన్, వక్కంతుల వంశీ తదితరులు కోదాటి నరసింహకు ఫోన్ చేసి ఎక్కడున్నావని ఆరా తీశారు. ముస్తఫానగర్‌లోని వైఎస్‌ఆర్‌టీపీ కార్యాలయంలో ఉన్నానని చెప్పారు. అక్కడికి వెళ్లి వ్యక్తిగతంగా ఎందుకు పోస్టులు పెట్టావని అడగటంతో దురుసుగా సమాధానం చెప్పాడు. 


దీంతో ఆగ్రహానికి గురైన నాయకులు సదరు వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం టీడీపీ లోక్ సభ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... నారా, నందమూరు కుటుంబాలకు చెందిన వ్యక్తులపై వ్యక్తిగతంగా అసభ్య పదజాలం వాడితే సహించేది లేదని హెచ్చరించారు. 


గతంలో అసెంబ్లీలోనే చంద్రబాబు భార్యపై అసభ్య వ్యాఖ్యలు


ఏడాది క్రితం ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన సతీమణిపై వైఎస్‌ఆర్‌సీపీ దారుణమైన వ్యాఖ్యలు చేశారని సభ బయటకు వచ్చిన చంద్రబాబు బోరున విలపించారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, మంత్రి అప్పలరాజు అదే పనిగా వ్యాఖ్యలు చేశారన్నారని చంద్రబాబు  భావోద్వేగానికి గురయ్యారు. రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా....ప్రజా సమస్యల పై చర్చల కోసం భరించానన్నారు చంద్రబాబు. తన భార్యను, కుటుంబసభ్యులను కూడా రోడ్డు మీదకు తెస్తున్నారని అన్నారు. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు మైక్‌ను కట్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు తాను చెప్పాలనుకున్నది చెప్పారు. మళ్లీ సీఎంగానే సభలోకి వస్తానని సవాల‌్ చేసి.. సభ్యులందరికీ నమస్కారం చేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల మాటలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. రెండు నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేకపోయారు. 


తాను గెలిచినప్పుడు పొంగిపోలేదని.. ఓడినప్పుడు కుంగిపోలేదన్నారు. తాను అధికారంలో ఎప్పుడు ఉన్నా ఎవర్నీ కించ పరచలేదన్నారు. కానీ ఇప్పుడు తన భార్యను కూడా ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తున్నారన్నారు. ఈ అవమాలన్నింటిపై ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆయన కోడలు నారా బ్రాహ్మిణిపై పలువురు అభ్యంతరకర పోస్టులు పెట్టడం కలకలం సృష్టిస్తోంది.