Khammam News: ఓ వైపు గుండె పగిలే బాధ. మరోవైపు చేతుల్లో కూతురు శవం. ఇంత ఆవేదన, దు:ఖం చాలదన్నట్లు వాళ్లు వెళ్లేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ దంపతులు.. కూతురు శవాన్ని చేతుల్లో పట్టుకొనే 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇంటి వరకూ ద్విచక్ర వాహనంపైనే వెళ్లారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చాలానే చూసినప్పటికీ ఖమ్మం జిల్లాలో (Khammam District News) మాత్రం ఇదే మొదటి సారి.


ఖమ్మం జిల్లా (Khammam District News) లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో ఓ తండ్రి దీనగాధ అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ... ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో ఫ్రీ అంబులెన్స్ లేకపోవడం, ప్రైవేటు అంబులెన్సులో తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఏం చేయాలో తెలియని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఓ వైపు గుండె పగిలే బాధ, మరోవైపు కూతురు శవాన్ని ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచన.. దిక్కుతోచని స్థితిలో బండిపైనే పయనం అయ్యారు. భర్త బండి నడుపుతుండగా.. భార్య పాప మృతదేహాన్ని పట్టుకొని వెనక కూర్చుంది. దాదాపు 50 కిలో మీటర్ల మేర ప్రయాణం చేస్తూ.. వాగు దాటుకుంటూ చివరకు ఇంటికి చేరుకున్నారు. ఈ దృశ్యం చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టారు.


కొత్త మేడేపల్లి గ్రామానికి చెందిన వెట్టి సుక్కి అనే ఆదివాసీ గిరిజన బాలిక రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉచిత అంబులెన్స్ కోసం సిబ్బందిని సంప్రదించాడు. అంబులెన్స్ సౌకర్యం లేదని చెప్పడంతో ప్రైవేటు అంబులెన్స్, ఆటోలకు డబ్బులు చెల్లించలేకపోయిన తండ్రి.. తానే స్వయంగా మృతదేహాన్ని బైక్ పైనే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భార్య చేతిలో కూతురు శవాన్ని పెట్టి తాను బైకు నడుపుతూ ఇంటికి చేరుకున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఇంకా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమే. 


ఐదు నెలల క్రితం నెల్లూరులో కూడా ఇలాంటి ఘటనే..


నెల్లూరు జిల్లా (Nellore News) సంగంకు చెందిన శ్రీరామ్, ఈశ్వర్ అనే పిల్లలిద్దరూ కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో జారి పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు, తల్లిదండ్రులు.. శ్రీరామ్ చనిపోయినట్లు గుర్తిచారు. కానీ ఈశ్వర్ బతికే ఉన్నాడనుకున్న తండ్రి..  కుమారుడిని పట్టుకుని ద్విచక్ర వాహనంపైనే ఆస్పత్రికి చేరుకున్నారు. కానీ అప్పటికే బాబు చనిపోయాడని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలారు. మృతదేహం తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని కోరారు. 108 వాహనం ఇవ్వలేమని వైద్యులు చప్పడంతో గత్యంతరం లేక బాలుడి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. తండ్రే కుమారుడి శవాన్ని ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకెళ్లడం చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరు మున్నీరుగా విలపించారు.