వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ( YS Viveka Murder Case ) ఏం జరగబోతోంది ? . సీబీఐ డీఐజీ చౌరాసియా ( CBI DIG ) పులివెందులలో ఎందుకు మకాం వేశారు ? ఎంపీ అవినాష్ రెడ్డిని ( MP Avinash Reddy ) అరెస్ట్ చేస్తారా ? ఇప్పుడీ ప్రశ్నలు కడప జిల్లా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లోని అంశాలు బయటకు వచ్చాయి. అందులో కడప ఎంపీ అవినాష్ రెడ్డినే ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నట్లుగా సీబీఐ పేర్కొంది. దీంతో ఆయనను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. 


వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ( Dastagiri ) అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా అనుమతించవద్దని హైకోర్టులో వివేకా హత్య కేసు నిందితులు పెట్టుకున్న పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. దీంతో సీబీఐ ( CBI ) అధికారులు ఇప్పుడు మరోసారి న్యాయమూర్తి సమక్షంలో  వాంగ్మూలం నమోదు చేయించనున్నారు. ఇది రెండు రోజుల్లో పూర్తవుతుందని తెలుస్తోంది. దస్తగిరితో మరోసారి ఆ వాంగ్మూలం నమోదు చేయించిన తర్వాత సీబీఐ అధికారులు కీలకమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. 


హై ప్రోఫైల్ కేసు కావడంతో సీబీఐ డీఐజీ కూడా పులివెందులకు వచ్చారు. ఆయన కీలక అరెస్టులు నిర్వహించే వరకూ ఇక్కడే ఉండే అవకాశం ఉంది.  నిజానికి గత డిసెంబర్లోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఢిల్లీలోని సీబీఐ వర్గాల నుంచి మీడియాకు సమాచారం వచ్చింది. అవినాష్ రెడ్డి ఎంపీ కావడంతో స్పీకర్ ( Loksabha Speaker ) పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఈ కారణగా పార్లమెంట్ కార్యదర్శికి సీబీఐ అధికారులు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐకి స్పీకర్ కూడా అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. ఈ అనుమతి రావడంతోనే సీబీఐ డీఐజీ కడప వచ్చినట్లుగా భావిస్తున్నారు. 


దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ వివేకా కేసును సీబీఐ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చురుగ్గా విచారణ జరుపుతున్న అధికారులపై ఆరోపణలు చేస్తూ కొంత మంది తెరపైకి రావడంతో  సీబీఐ ఒత్తిడికి గురయింది. అయితే ఇది నిందితుల రివర్స్ వ్యూహంగా భావిస్తున్న సీబీఐ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఎలాంటి అవకాశాన్ని వదిలి పెట్టకుండా.. కేసును చేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.