ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారం పర్యటనను ఉన్నట్టుండి రద్దు చేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆయన మేడారం పర్యటన శుక్రవారం (ఫిబ్రవరి 18) ఉదయం 11 గంటలకు ఉంటుందని అధికారికంగా అంతకు కొద్దిరోజుల ముందే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయన నిన్న మేడారం వస్తారని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో శుక్రవారం మేడారం చేరుకున్నారు. ఆఖరికి హెలీ ప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. రోప్‌ పార్టీతో మాక్‌ డ్రిల్‌ నిర్వహించి సీఎం కోసం వేచి చూశారు. ఆయన వచ్చే సమయం దాటిపోయింది. అయినా కూడా సీఎంవో నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. సాయంత్రం వరకూ వేచి చూశారు. చివరికి సాయంత్రం 4 గంటల వరకు అంతా ఎదురుచూసి అంతా తిరుగుముఖం పట్టారు. 


టీఆర్‌ఎస్‌ శ్రేణులు, మేడారం వచ్చిన భక్తులు కేసీఆర్‌ రాకపోవడంతో నిరాశ చెందారు. అయితే, ఉన్నట్టుండి ఎలాంటి సమచారం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఎందుకు రద్దు అయిందనే అంశం వెనుక కారణాలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేతో సీఎం కేసీఆర్‌ భేటీ ఉంది. కాబట్టి, రేపు ఆయన ముంబయి వెళ్లనున్నారు. అయితే, ఈ సమావేశానికి సంబంధించి కీలకనేతలు, సలహాదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షిస్తున్నట్లుగా తెలిసింది. దేశ రాజకీయాల్లో మరో కూటమి ఏర్పాటుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కూడా సంప్రదింపులు జరిపే క్రమంలోనే మేడారం రాలేకపోయారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. అలాగే ఆయన ఒంట్లో బాగాలేక పోవడం వల్ల కూడా మేడారం పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్‌ మేడారానికి రాకపోవడంపై రకరకాలుగా చర్చ సాగుతోంది. 


అయితే, ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ పర్యటనలు చివరి నిమిషాల్లో రద్దు అవుతున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో చేరుకుంటారనే క్షణంలో పర్యటన రద్దయినట్లు ప్రకటనలు వెలువడుతున్నాయి. మొన్న ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలోనూ ఇలాగే జరిగింది. మళ్లీ ఇప్పుడు మేడారం విషయంలోనూ ఇదే జరిగింది. సీఎం హోదాలో మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే కేసీఆర్ చివరి క్షణంలో పర్యటనను రద్దు చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 


గతసారి జరిగిన మేడారం జాతరకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నిలువు దోపిడీ ఇచ్చి అమ్మవార్ల మొక్కులు తీర్చుకున్నారు. ఆ సమయంలో ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు సీతక్క కూడా సీఎం కేసీఆర్ వెంట ఉండి పూజల్లో పాల్గొన్నారు. ఎప్పుడూ కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేసే సీతక్క ఇలా మేడారంలో సీఎం పర్యటనలో పాల్గొనడం అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది.