Karnataka Crime News: అప్పటి దాకా చక్కగా, హాయిగా ఆడుకున్నాడు. అమ్మానాన్నలు, కుటుంబ సభ్యులు కూడా ఆ పన్నెండేళ్ల బాలుడు చేస్తున్న అల్లరి, ఆటలు చూసి మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే బాలుడి ఒక్కసారిగా ఛాతిపై చేయి వేసుకొని అమ్మా నొప్పి అంటూ ఇంట్లోకి వచ్చాడు. ఏమైందో ఏమో అని భయపడిపోయిన తల్లిదండ్రులు బాలుడిని వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే బాలుడు మృతి చెందినట్లు వివరించారు. 


అసలేం జరిగిందంటే..?


కర్ణాటక రాష్ట్రంలోని మడికేరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుశాలనగర తాలూకా కూడుమంగళూరులో పాఠశాల బస్సు డ్రైవర్ గా పని చేసే మంజాచారి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఆడుకుని, రాత్రి కావస్తుండడంతో ఇంట్లోకి వచ్చాడు. కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి బాధతో తల్లడిల్లిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే కశాలనగర ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు.. గుండెపోటు వల్ల అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. కీర్తన్ కు ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని బంధువులు వివరించారు. కానీ పన్నెండేళ్ల వయసుకే బాలుడు గుండె పోటుతో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం ఏంటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వచ్చే చావు పట్ల అంతా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. 


దాగుడు మూతలు ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన బాలుడు


ఇటీవలే ఓ బాలుడు తమ్ముడు, చెల్లితో కలిసి సరదాగా దాగుడుమూతలు ఆడుతున్నాడు. అదే అతడి పాలిట శాపంగా మారింది. ఆటలో భాగంగా ఇంట్లో నిల్వ చేసిన పత్తిలో పదేళ్ల బాలుడు దాక్కున్నాడు. ఊపిరాడక అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 


అసలేం జరిగిందంటే..?


కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నేపల్లిలోని చెన్నూరు కైలాస్, రమ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు అభిషేక్ కు పదేళ్ల వయస్సు. ప్రస్తుతం అతడు కౌటాలలోని ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం బడికి వెళ్లి వచ్చిన అభిషేక్.. తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడు మూతల ఆట మొదలు పెట్టాడు. ఆ సమయానికి తల్లిదండ్రులు చేనులో ఉన్నారు. తమ్ముడు, చెల్లికి దొరక్కుండా ఉండేందుకు ఇంట్లో నిల్వ చేసిన పత్తి కుప్పలోకి చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. తల లోపలకు వెళ్లగా కాళ్లు బయటనే ఉండిపోయాయి. కొద్దిసేపటికి చెల్లి, తమ్ముడు చూసి పెద్దపెట్టున అరిచారు. అప్పటికే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అభిషేక్ ను బయటకు లాగి స్థానిక హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే అభిషేక్ చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు విపరీతంగా ఏడుస్తున్నారు. వారి దుఃఖాన్ని చూసిన గ్రామస్థులు కూడా కన్నీరు పెడుతున్నారు.