ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష ప్రశ్నపత్రం తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఇచ్చారని, చదవి అర్థం చేసుకునేందుకే ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తక్కువ సమయం మిగిలిందని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రం.. ఉద్యోగార్థుల సత్తా పరీక్షించేందుకే ఎక్కువ నిడివిగల ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. మొత్తంగా ప్రిలిమ్స్ పరీక్ష కఠినంగా ఉన్నట్లు ఎక్కువ మంది తెలిపారు. యూపీఎస్సీ స్థాయిలో ప్రశ్నపత్రం ఉందని చెప్పారు.


ప్రశ్నపత్రం పరిశీలిస్తే..!
ప్రశ్నపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రశ్నలు అడిగారు. ఉదయం నిర్వహించిన పేపర్-1లో ఏపీ ఎకానమీ విభాగంలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్, నవరత్నాలు, దిశ యాప్, కౌలు రైతులు, పోలవరం అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఇక మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2 కరెంట్ అఫైర్స్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో నవరత్నాల్లో భాగం కానిది ఏది? ఆపదలో ఉన్న మహిళల కోసం ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఎస్‌వోఎస్ సేవ ఏది? తదితర ప్రశ్నలు వచ్చాయి. వీటితోపాటు మత్స్యకార భరోసా, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, మైనారిటీలకు ప్రత్యేక బడ్జెట్, ఉర్దూ అధికార భాషగా ప్రకటన, విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఓడరేవుల నిర్మాణం, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులు, ఇటీవల నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంశాలపై ప్రశ్నలు అడిగారు. 


హిస్టరీ, సైన్స్ & టెక్నాలజీపై ప్రశ్నలు కఠినంగానే!
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1లో హిస్టరీకి సంబంధించి అడిగిన ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. అదేవిధంగా జాగ్రఫీ ప్రశ్నలు కొన్ని కఠినంగా వచ్చాయన్నారు. పాలిటీ, ఎకానమీ ప్రశ్నలు కొంత సులభతరంగా ఉన్నాయని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఇక పేపర్-2 సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అంతరిక్షంపై అడిగిన ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు చెప్పారు. అరిథ్‌మెటిక్ & రీజినింగ్‌పై వచ్చిన ప్రశ్నలు కొంత కష్టతరంగా ఉన్నాయని, ఎక్కువ ప్రశ్నలు మ్యాథమెటిక్స్‌పైనే అడిగినట్లు అభ్యర్థులు తెలిపారు. మొత్తంగా చూస్తే.. రెండు పేపర్లలోనూ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయని, సమాధానాలను గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేలా ఇచ్చారని వెల్లడించారు. ఇంగ్లిష్ ప్రశ్నలను తెలుగులో యథాతథంగా అనువదించడంతో అర్థం చేసుకోవడం కొంత ఇబ్బందిగా మారిందని తెలుగు మీడియం విద్యార్థులు తెలిపారు. 


Also Read: 'గూగుల్' చూస్తూ 'గ్రూప్-1' పరీక్ష, విజయవాడలో ఓ అభ్యర్థి నిర్వాకం!


కటాఫ్‌ మార్కులు ఇలా ఉండొచ్చు?
గ్రూప్-1 పరీక్ష కటాఫ్ మార్కులకు సంబంధించి ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షకు 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తే 110 (రెండు పేపర్లు కలిపి 240 మార్కులకు) వరకూ కటాఫ్ మార్కులు, ఒకవేళ 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తే 90 కిపైగా కటాఫ్ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేపర్-1లో 70, పేపర్-2లో 60 మార్కులు ఉండొచ్చని అంటున్నారు.


పరీక్షకు 82.38 శాతం అభ్యర్థులు హాజరు
ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (జనవరి 8న) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు.ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. రాతపరీక్షకు 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. అంటే 82.38 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా నంద్యాల జిల్లా 85.89 % మంది అభ్యర్థులు హాజరుకాగా, అత్యల్పంగా కృష్ణా జిల్లా (73.99%) జిల్లా నుంచి హాజరయ్యారు.


ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల హాజరు వివరాలు జిల్లాలవారీగా ఇలా..


మూడువారాల్లోనే ఫలితాలు..?
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను మూడు వారాల్లోనే వెల్లడించనున్నారు. ఫలితాలు వచ్చిన 90 రోజుల్లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత ఇంటర్వ్యూలు పూర్తిచేసి ఆగస్టు నాటికి నియామకాలు పూర్తిచేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.


Also Read:


APPSC: గుడ్ న్యూస్, త్వరలో 'గ్రూప్-2' నోటిఫికేషన్! పోస్టులెన్నో తెలుసా?
ఏపీలోని ఉద్యోగార్థులు ఒకవైపు 'గ్రూప్-1' ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతున్న వేళ.. 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. త్వరలోనే గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 'గ్రూప్-2' పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు - ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిస్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇక మీదట ప్రిలిమ్స్ తరహాలోనే మెయిన్స్ పరీక్షను కూడా నిర్వహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పటి నుంచి మెయిన్స్ పరీక్షలోనూ మూడు పేపర్ల స్ధానంలో రెండు పేపర్లే ఉండనున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఆర్ధికశాఖ జనవరి 6న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...