జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లో భూ తగాదాలు పడగ విప్పాయి. పాత కక్షలతో ఇరిశెట్టి రాజేష్ అనే యువకుడిని ప్రత్యర్థులు హత్య చేశారు. దీని కోసం ముందే పథకాన్ని సిద్ధం చేసినట్లుగా సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. ధరూర్ గ్రామ శివారులో రాజేష్ తన పొలానికి నీళ్లు పెట్టడం కోసం వెళ్లి తన పని చేసుకుని వస్తుండగా.. అక్కడే కాపు కాసిన నలుగురు వ్యక్తులు తన కొడుకును చంపేశారని హతుడి తండ్రి ఆరోపించాడు. తల్వార్‌తో నరికి చంపారని పోలీసులకు చెప్పాడు. తమకు ఉన్న  భూతగాదాలు దీనికి కారణం కారణం అంటూ మృతుడి తండ్రి వెంకన్న తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు అక్కడే ఉన్న బుల్లెట్ బైక్, తల్వార్ కవర్‌ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ కృష్ణ కుమార్ తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.


అయితే, ఈ భూవివాదం 2 గుంటల భూమి దగ్గర అని తెలుస్తోంది. కొన్ని ఏళ్ల క్రితం ఒక వర్గం వారికి రెండు గుంటల భూమి ఎక్కువగా పంచడంతో మరో వర్గం వారు దానిపై కక్ష పెంచుకున్నట్లుగా స్థానికులు తెలిపారు. తమకు కూడా ఒక గుంట భూమి ఇవ్వాలని వారు ఎన్నో గొడవలు పెట్టుకున్నారని తెలిపారు. పెద్ద మనుషుల మధ్యలో ఎన్నోసార్లు పంచాయతీ జరిగినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. దీనిపై హతుడి తండ్రి మీడియాతో మాట్లాడారు.


‘‘2 గుంటల భూమికాడ భూవివాదం ఉంది. మా తాత గతంలో మాకు 2 గుంటల భూమి మాకు ఇచ్చారు. దాన్ని మొత్తం సాఫ్ చేసుకున్నం. దానికి రూ.5 లక్షల దాకా ఖర్చయింది. దీనిపై గతంలో 20 సార్లు పంచాయతీ పెట్టారు. అయినా వివాదం పరిష్కారం కాలేదు. గత సంవత్సరం ప్రత్యర్థులు భూమి కోసం నన్ను చంపుదామని మా ఇంటికి వచ్చారు. నాపై దాడి చేశారు. నా తల పగిలింది. గతంలో కూడా చాలా గొడవలు జరిగాయి. సతీశ్, సంతోష్, వేణు అనే వాళ్లు నా కొడుకును తల్వార్‌తో నరికి చంపేశారు.’’ అని హతుడి తండ్రి వెంకన్న మీడియాతో అన్నారు.